TTD: తిరుమలలో విజిలెన్స్ దాడులు ముమ్మరం ... మరో ఐదుగురు దళారీల అరెస్ట్!

  • లోకల్ నేత సిఫార్సుపై 18 బ్రేక్ దర్శనం టికెట్లు
  • అధిక ధరకు విక్రయించి దొరికిపోయిన ప్రసాద్
  • విజిలెన్స్ అధికారుల అదుపులో మరో నలుగురు
పరమ పవిత్రమైన తిరుమలలో దళారులు లేకుండా చేయాలన్న ఉద్దేశంతో కొనసాగుతున్న విజిలెన్స్ అధికారుల దాడుల్లో మరింత మంది పట్టుబడ్డారు. తాజాగా, స్థానిక వైసీపీ ప్రజా ప్రతినిధి సిఫార్సు లేఖపై చైర్మన్ ఆఫీసులో 18 బ్రేక్ దర్శనం టికెట్లను పొందిన ప్రసాద్ అనే వ్యక్తి, వాటిని అధిక ధరలకు విక్రయించి చిక్కాడు.

ప్రసాద్ తో పాటు  వెంకట రమణ, శ్రీనివాసులు, ప్రేమ్ కుమార్, వాసు అనే వారిని అరెస్ట్ చేసి విచారిస్తున్నామని ఉన్నతాధికారులు తెలిపారు. వీరంతా వివిధ సిఫార్సు లేఖలపై టికెట్లను పొంది, వాటిని ఎక్కువ ధరకు అమ్ముతున్నవారేనని తేలిందని చెప్పారు. కాగా, గడచిన వారం వ్యవధిలో తిరుమలలో పట్టుబడిన దళారుల సంఖ్య 20కి చేరింది.

దర్శనాలు, అద్దె గదుల విషయంలో భక్తులను మోసగిస్తున్న వీరు, నిత్యమూ లక్షల్లో దండుకుంటున్నట్టు విచారణలో వెల్లడైంది. కాగా, అరెస్ట్ అయిన వారిలో ప్రసాద్ ను విడిచి పెట్టాలని రాజకీయ ఒత్తిళ్లు వస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం అతన్ని రహస్య ప్రదేశంలో ఉంచి విచారిస్తున్నారు.
TTD
Tirumala
Tirupati
Arrest
Mediators

More Telugu News