Andhra Pradesh: ప్రతి భక్తుడూ ఓ వీఐపీనే: ఏపీ మంత్రి వెల్లంపల్లి
- దేవాలయాల పవిత్రతను కాపాడుదాం
- ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసేలా కలిసి పనిచేద్దాం
- ప్రతి భక్తుడికి నాణ్యమైన సేవలు అందించాలి
దేవాలయాల్లో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసేలా అందరం కలిసి పని చేద్దామని ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పిలుపు నిచ్చారు. దేవదాయ ధర్మదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో ప్రత్యేక కార్యదర్శి మన్మోహన్ సింగ్, కమిషనర్ పద్మ ఆధ్వర్యంలో ఎండోమెంట్ ఉద్యోగుల రెండు రోజుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ, సీఎం జగన్మోహన్ రెడ్డి పారదర్శక పాలన అందిస్తున్నామని, ఇదే స్ఫూర్తితో ఉద్యోగులు అందరూ పని చేయాలని, ప్రతి భక్తునికి నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు. దేవాలయాల్లో పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని, నిబంధనలను తు.చ. తప్పకుండా పాటించాలని అన్నారు. దేవాలయాలు, సంబంధిత భూముల సమస్యల పరిష్కారానికి, ఉద్యోగుల ఇబ్బందులు పరిష్కరించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధికి, ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఎటువంటి సిఫార్సులు లేకుండా ఉద్యోగుల అర్హత మేరకు పదోన్నతులు లభిస్తాయని చెప్పారు.