Andhra Pradesh: ‘అమరావతి’ తరలింపుపై రగడ.. స్పందించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి!

  • రాజధాని రాష్ట్రానికి సంబంధించిన విషయం
  • ఇది అసలు కేంద్రం పరిధిలోకే రాదు
  • హైదరాబాద్ ను దేశానికి రెండో రాజధాని చేయట్లేదు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని తరలించబోతున్నారని పలు పత్రికల్లో కథనాలు ప్రచురితమైన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ నేతలు మండిపడుతుండగా, వైసీపీ నేతలు వ్యూహాత్మకంగా, ఆచితూచి మాట్లాడుతున్నారు. తాజాగా ఈ వివాదంపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి, బీజేపీ నేత కిషన్ రెడ్డి స్పందించారు. రాజధాని నిర్మాణం అన్నది రాష్ట్రానికి సంబంధించిన విషయమని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ వ్యవహారంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. అసలు ఇది కేంద్రం పరిధిలోకే రాదని తేల్చిచెప్పారు.

హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌ ఈఎస్‌ఐసీలో రూ.150 కోట్లతో కొత్త బ్లాక్‌ నిర్మాణానికి ఈరోజు కిషన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ..తెలంగాణలో ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని అమలు చేయాలని కోరారు. ఆరోగ్యశ్రీ మంచి కార్యక్రమం అయితే ధర్నాలు ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డా ఎవరో తెలియదని చెప్పడం కేటీఆర్ అహంకారానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. 2023లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. ఇక హైదరాబాద్ ను దేశానికి రెండో రాజధానిగా చేయబోతున్నారన్న వార్తలను మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తారన్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు.

Andhra Pradesh
YSRCP
Telugudesam
BJP
kishan reddy
cabinet
amaravati
moving

More Telugu News