Chandrababu: గోదావరికి వరదొస్తే జెరూసలెం వెళ్లారు, కృష్ణా నదికి వరదొస్తే అమెరికా వెళ్లారు: సీఎం జగన్ పై చంద్రబాబు విసుర్లు

  • తనపై కక్షతో లక్షల మందిని వరదల్లో ముంచేశారని చంద్రబాబు ఆగ్రహం
  • తనను, తన నివాసాన్ని లక్ష్యంగా చేసుకోవడమే వైసీపీ ప్రధాన ఉద్దేశం అంటూ వ్యాఖ్యలు
  • కృష్ణా, గుంటూరు టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు
ఇటీవల ఏపీ సీఎం జగన్ వెంటవెంటనే రెండుసార్లు విదేశీ పర్యటనలు చేస్తుండడం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. కృష్ణా నది వరదలు తీవ్రస్థాయిలో రావడం పట్ల చంద్రబాబు ఇవాళ కృష్ణా, గుంటూరు జిల్లాల టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తనపై కక్షతో లక్షల మంది ప్రజలను వరదల్లో ముంచేశారని మండిపడ్డారు. ఇళ్లు, వేల ఎకరాల పంటలు నీట మునిగాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ప్రభుత్వం వరద నిర్వహణను ఏమాత్రం పట్టించుకోవడంలేదని ఆరోపించారు. వరద తీవ్రత అంచనా, ముందు జాగ్రత్త అంశాల్లో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. తనను, తన నివాసాన్ని లక్ష్యంగా చేసుకోవడమే వైసీపీ ప్రధాన ఉద్దేశమని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై కక్షకట్టి రాష్ట్రానికి నష్టం, పేదలకు కష్టం కలిగిస్తున్నారని వ్యాఖ్యానించారు. కృష్ణా నదికి వరదలొస్తే సీఎం అమెరికా వెళ్లారని, మొన్న గోదావరికి వరదలొస్తే జెరూసలెం వెళ్లారని వ్యంగ్యం ప్రదర్శించారు.

రాష్ట్రాభివృద్ధిపై, పేదల సంక్షేమంపై వైసీపీకి శ్రద్ధలేదని విమర్శించారు. నిత్యావసరాలు అందక వరద బాధితులు అల్లాడిపోతున్నారని అన్నారు. వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ బెదిరింపులు, వేధింపులతో రాష్ట్రానికి అపారనష్టం కలుగుతోందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు.
Chandrababu
Jagan
Andhra Pradesh

More Telugu News