Jagan: ఒక్క రోజులోనే ప్రజావేదికను కూల్చారు.. ఈ పని మాత్రం ఎందుకు చేయలేకపోతున్నారు?: జగన్ పై విష్ణుకుమార్ రాజు విమర్శలు

  • 70 రోజులు గడుస్తున్నా ఇసుక విధానంపై నిర్ణయం తీసుకోలేదు
  • 70 రోజుల్లో జగన్ అపాయింట్ మెంట్ కూడా దొరకలేదు
  • ఎప్పుడు కావాలన్నా చంద్రబాబు అపాయింట్ మెంట్ దొరికేది
ముఖ్యమంత్రి జగన్ పై బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు విమర్శలు గుప్పించారు. ఒక్క రోజులోనే అమరావతిలోని ప్రజావేదికను కూల్చేశారని... 70 రోజులు గడుస్తున్నా ఇసుక విధానంపై నిర్ణయాన్ని ఎందుకు తీసుకోలేకపోతున్నారని ప్రశ్నించారు. ఇసుక లభించకపోవడంతో... ఎంతో మంది కార్మికులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఈ 70 రోజుల్లో జగన్ అపాయింట్ మెంట్ కూడా దొరకలేదని విమర్శించారు. ఇది సరైన పద్ధతి కాదని అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏవైనా ప్రజా సమస్యలపై మాట్లాడాలంటే ఒక్క రోజులోనే అపాయింట్ మెంట్ దొరికేదని తెలిపారు. కాంట్రాక్టర్లను ప్రభుత్వం టార్గెట్ చేస్తోందని... అధికారులు కుమ్మక్కైతేనే అవినీతి సాధ్యమవుతుందని చెప్పారు. జగన్ తీరు చూస్తుంటే ఆయనకు సరైన సలహాదారులు లేరని అనిపిస్తోందని అన్నారు.

ఇదే సమయంలో టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు గురంచి విష్ణుకుమార్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓట్లు వేసిన విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గ ప్రజలకు గంటా అందుబాటులో ఉండాలని విన్నవించారు. ఏ పార్టీలో ఉంటారో ఆయనే తేల్చుకోవాలని... బీజేపీలోకి వస్తే స్వాగతిస్తామని చెప్పారు.  
Jagan
Chandrababu
Vishnu Kumar Raju
Telugudesam
YSRCP
BJP

More Telugu News