Godavari: గోదావరికి భారీగా పెరుగుతున్న వరద... బిక్కుబిక్కుమంటున్న ప్రజలు!

  • ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు
  • భద్రాచలం వద్ద 43 అడుగుల నీటిమట్టం
  • ధవళేశ్వరం నుంచి 4 లక్షల క్యూసెక్కులు విడుదల
మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు గోదావరిలో క్రమంగా వరద పెరుగుతోంది. నిన్న ఉదయం భద్రాచలం వద్ద 25 అడుగుల మేరకు ఉన్న నీటిమట్టం, రాత్రికి 40 అడుగులకు, ఈ ఉదయం 43 అడుగులకు చేరింది. నదిలో దాదాపు ఆరున్నర లక్షల క్యూసెక్కులకు పైగా నీరు ప్రవహిస్తోంది. గోదావరికి ఉపనదులైన ప్రాణహిత, ఇంద్రావతి నుంచి కూడా వరద నీరు వస్తుండటంతో నీటిమట్టం పెరుగుతోంది.

పరిస్థితిని గమనించిన పోలవరం ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు, మరోమారు వరద ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీచేశారు. నేడు వరద మరింత పెరుగుతుందన్న భయంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు, ముంపు గ్రామాలవాసులు బిక్కుబిక్కుమంటున్నారు. గడచిన 16 రోజులుగా వరదముంపులో ఉండి, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న వేలేరుపాడు, కుక్కునూరు, పోలవరం మండలాల్లోని పలు గ్రామాల్లోకి మళ్లీ నీరు చేరింది. దీంతో ఎన్నో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కాగా, ధవళేశ్వరం వద్ద కాటన్‌ బ్యారేజీ మొత్తం గేట్లను ఒక మీటరు మేరకు ఎత్తి, దాదాపు 4 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు.
Godavari
Bhadrachalam
Water
Flood

More Telugu News