Osmania University: ఓయూ మహిళా హాస్టల్‌లో కలకలం.. గోడ దూకొచ్చిన ఆగంతుకుడు.. కత్తి చూపించి యువతితో అసభ్య ప్రవర్తన

  • గురువారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఘటన
  • చెట్టుపైకెక్కి కూర్చుని యువతి రాగానే కిందికి దూకి బెదిరింపు
  • కేకలు వేయడంతో సెల్‌ఫోన్ లాక్కుని పరారీ
హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో గురువారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో కలకలం రేగింది. ఇంజినీరింగ్ మహిళా హాస్టల్‌లోకి చొరబడిన ఓ ఆగంతుకుడు విద్యార్థినిని కత్తితో బెదిరించి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె కేకలు వేయడంతో ఇతర విద్యార్థినులు బయటకు రావడంతో వారిని చూసిన దుండగుడు ఆమె నుంచి మొబైల్ ఫోన్ లాక్కుని పరారయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

గురువారం తెల్లవారుజామున హాస్టల్ వెనక గోడకు ఆనుకుని ఓ చెట్టుంది. దానిపైకి ఎక్కి కూర్చున్న దుండగుడు ఓ విద్యార్థిని బాత్రూం కోసం అటుగా వస్తుండగా చూసి వెంటనే కిందికి దూకి ఆమెను అడ్డగించాడు. ఆమెకు కత్తిచూపించి బెదిరించి అసభ్యంగా ప్రవర్తించాడు. ఒక్కసారిగా భయంతో వణికిపోయిన బాధిత విద్యార్థిని వెంటనే గట్టిగా కేకలు వేసింది.

దీంతో గదుల్లోంచి ఇతర విద్యార్థినులు బయటకు వచ్చారు. వారిని చూసిన నిందితుడు బాధిత విద్యార్థి నుంచి స్మార్ట్‌ఫోన్ లాక్కుని పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. కాగా, పగిలిపోయిన స్థితిలో ఉన్న బాధితురాలి మొబైల్ ఫోన్‌ను ప్రహరీ వెనక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 
Osmania University
Hyderabad
Telangana

More Telugu News