Rahul Gandhi: రాహుల్ గాంధీ షరతులపై జమ్మూకశ్మీర్ గవర్నర్ ఫైర్

  • కశ్మీర్ అంశాన్ని రాహుల్ రాజకీయం చేయాలనుకుంటున్నారు
  • జమ్మూకశ్మీర్ లో అస్థిరతను పెంచాలనుకుంటున్నారు
  • టీవీ ఛానళ్లను చూసి వాస్తవాలను రాహుల్ తెలుసుకోవాలి
జమ్మూకశ్మీర్ పర్యటన నిమిత్తం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ షరతులు విధించడంపై గవర్నర్ సత్యపాల్ మాలిక్ మండిపడ్డారు. జమ్మూకశ్మీర్ లో అస్థిరత్వాన్ని నెలకొల్పేలా రాహుల్ వ్యాఖ్యలు ఉన్నాయని ఆయన అన్నారు. జమ్మూకశ్మీర్ ప్రస్తుతం చాలా ప్రశాంతంగా ఉందని... చూడాలనుకుంటే రాహుల్ గాంధీకి విమానం పంపిస్తామని సత్యపాల్ మాలిక్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

ఈ వ్యాఖ్యలపై రాహుల్ స్పందిస్తూ, విమానం మీరు పంపించాల్సిన అవసరం లేదని, తామే ఒక బృందంగా తాము ఏర్పాటు చేసుకున్న విమానంలో వస్తామని సెటైర్ వేశారు. జమ్మూకశ్మీర్ లో తమను ప్రశాంతంగా తిరగనిస్తే చాలని, సైనికులు, స్థానికులతో మాట్లాడే అవకాశం కల్పిస్తే చాలని ఎద్దేవా చేశారు.

ఈ వ్యాఖ్యలపై సత్యపాల్ మాలిక్ మాట్లాడుతూ, పర్యటనకు రాక ముందే రాహుల్ పలు షరతులు పెట్టారని అన్నారు. విపక్ష పార్టీలకు చెందిన నేతలతో కలసి రావడం వల్ల కశ్మీర్ అంశాన్ని రాహుల్ రాజకీయం చేయాలనుకుంటున్నారని విమర్శించారు. స్థానికుల్లో అస్థిరతను, అభద్రతా భావాన్ని మరింత ఎక్కువ చేసేందుకు యత్నిస్తున్నారని చెప్పారు. కశ్మీర్ లో ప్రస్తుత పరిస్థితులు ఎంత ప్రశాంతంగా ఉన్నాయో భారత టీవీ ఛానళ్లను చూసి రాహుల్ తెలుసుకోవాలని సూచించారు.
Rahul Gandhi
Congress
Satya Pal Malik
Jammu And Kashmir
Governor

More Telugu News