India: డాక్టర్ పై దాడి చేస్తే పదేళ్లు జైలుకే.. కొత్త చట్టం తీసుకురానున్న కేంద్రం!

  • వైద్య సిబ్బందిపై దాడిచేస్తే 3-10 ఏళ్ల జైలుశిక్ష
  • రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ జరిమానా
  • వివరాలు ప్రకటించిన కేంద్ర మంత్రి హర్షవర్థన్
ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా వైద్యులపై రోగుల కుటుంబ సభ్యులు దాడిచేస్తున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. తమవారిని వైద్యులు పట్టించుకోవడం లేదనీ, చికిత్స సరిగా చేయని కారణంగానే చనిపోయారంటూ బంధువులు వైద్యులపై కోపంతో దాడి చేస్తున్నారు. దీంతో పలుచోట్ల వైద్యులు తమకు రక్షణ కల్పించాలని ఆందోళనకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైద్యులపై దాడిచేస్తే 10 ఏళ్ల జైలుశిక్ష విధించేలా కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నట్లు ప్రకటించింది.

ఈ విషయమై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్ మాట్లాడుతూ.. వైద్యులు, వైద్య సిబ్బందిపై దాడికి పాల్పడే వారికి 3-10 సంవత్సరాల జైలుశిక్ష, రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ జరిమానా విధించేలా చట్టాన్ని తీసుకొస్తున్నామని తెలిపారు. దీని ప్రకారం ఆసుపత్రిపై దాడికి పాల్పడి సామగ్రికి నష్టం కలిగిస్తే 6 నెలల నుంచి ఐదేళ్ల జైలుశిక్షతో పాటు రూ.50,000 నుంచి రూ.5 లక్షల వరకూ జరిమానా విధిస్తామని వెల్లడించారు.

ఈ మేరకు ముసాయిదా బిల్లును రూపొందించామనీ, త్వరలోనే దీనిపై అన్నివర్గాల నుంచి అభిప్రాయ సేకరణ చేపడతామని పేర్కొన్నారు. ఓసారి ప్రజామోదం పొందాక దీన్ని కేబినెట్ ఆమోదిస్తుందనీ, ఆ తర్వాత పార్లమెంటులో ప్రవేశపెడతామని చెప్పారు.
India
doctors
attacked
new act
criminalise
10 years jail
Police
hospitals

More Telugu News