Jammu And Kashmir: కశ్మీర్‌ నిప్పుతో బీజేపీ చెలగాటం ఆడుతోంది: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌సింగ్‌

  • అత్యుత్సాహం ప్రదర్శిస్తే చేజారిపోయే ప్రమాదం
  • జాగరూకతతో వ్యవహరించాలని కోరుతున్నాం
  • మాజీ సీఎం శివరాజ్‌సింగ్‌ వ్యాఖ్యలు చౌకబారువి

నివురుగప్పిన నిప్పులా ఉన్న కశ్మీర్‌ సమస్యతో బీజేపీ ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని, జాగరూకతతో వ్యవహరించకపోతే ఆ రాష్ట్రం మన చేయిజారిపోయే ప్రమాదం ఉందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌సింగ్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న 370 అధికరణ రద్దు ద్వారా తామేదో ఘనకార్యం చేసినట్లు బీజేపీ నాయకులు జబ్బలు చరుచుకుంటున్నారని, కానీ ఈ నిర్ణయంపై అంతర్జాతీయంగా మీడియాలో వస్తున్న కథనాలు చూస్తే ప్రభుత్వం ఎంత ప్రమాదకరమైన అడుగులు వేస్తోందో అర్థమవుతుందని అన్నారు. నిన్న మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఈ విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్‌షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌దోవల్‌కు ఆయన విజ్ఞప్తి చేశారు.

కశ్మీర్‌ను కాపాడుకోవడంపై సమగ్ర ప్రణాళిక వేయాలని కోరారు. కాగా, కాల్పుల విరమణకు అంగీకరించి తొలి ప్రధాని నెహ్రూ నేరానికి పాల్పడ్డారంటూ మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ చేసిన వ్యాఖ్యలను దిగ్విజయ్‌ చౌకబారువని కొట్టిపారేశారు. ‘నెహ్రూ కాలి ధూళికి కూడా పనికిరాని వ్యక్తి చేసిన వ్యాఖ్యలను ఎందుకు పట్టించుకోవాలి? ఇటువంటి వ్యాఖ్యలు చేసినందుకు ఆయనే సిగ్గు పడాలి’ అని వ్యాఖ్యానించారు.

More Telugu News