Jagan: మీరు లాభపడండి, మా యువతకు ఉద్యోగాలివ్వండి: డిప్లొమాటిక్ ఔట్ రీచ్ సదస్సులో వైఎస్ జగన్

  • నూతన పెట్టుబడులకు ఏపీ అనుకూలం
  • రెండు నెలల్లోనే విప్లవాత్మక నిర్ణయాలు
  • మా పాలన పారదర్శకంగా ఉంటుంది
  • దౌత్యవేత్తలతో వైఎస్ జగన్

నూతన పెట్టుబడులు పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతో అనుకూలమైనదని, ఇక్కడ ఇన్వెస్ట్ చేసే కంపెనీలు మంచి లాభాలను ఆర్జిస్తాయని ఏపీ సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం విజయవాడలో డిప్లొమాటిక్ ఔట్ రీచ్ సదస్సు ప్రారంభంకాగా, జగన్ ప్రసంగించారు. కంపెనీలు లాభపడి, ఇక్కడి యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పించాలని ఆయన కోరారు. తాము అధికారంలోకి వచ్చి రెండు నెలలే అయిందని, ఈ సమయంలోనే విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నామని, పాలన పారదర్శకంగా ఉండేలా చూడటమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

అమెరికా, యూకే, జపాన్, సింగపూర్, ఆస్ట్రియా, కెనడా, కొరియా, పోలాండ్, ఆస్ట్రేలియా, టర్కీ తదితర 35 దేశాల రాయబారులు, హైకమిషనర్లు, ఉన్నతాధికారులు ఈ సదస్సుకు హాజరుకాగా, వారిని ఉద్దేశించి జగన్ ప్రసంగించారు. రాష్ట్రంలో హైదరాబాద్, బెంగళూరు , చెన్నై వంటి మహా నగరాలు లేకపోవడం ఇబ్బందే అయినా, తమ బలహీనతలు ఏంటో, బలాలు ఏంటో తెలుసునని జగన్ అన్నారు. అపారమైన అడవులు, సుదీర్ఘ సముద్ర తీరప్రాంతం, వనరులు, సుస్థిర ప్రభుత్వం, కేంద్ర సహకారం ఉన్న ప్రభుత్వం తమదని వ్యాఖ్యానించారు.

అసెంబ్లీలో 86 శాతం సీట్లను గెలుచుకున్నామని, లోక్ సభలో నాలుగో అతిపెద్ద పార్టీ తమదేనని, ఇరుగు, పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలున్నాయని గుర్తు చేశారు. రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టే కంపెనీలకు లాభాలు వచ్చేందుకు ప్రభుత్వం తరఫున చేయాల్సిన సాయమంతా చేస్తామని, పరిశ్రమల్లో కల్పించే ఉద్యోగాల్లో మాత్రం స్థానికులకే పెద్ద పీట వేయాలని అన్నారు. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు చూపించే పరిస్థితి లేకుంటే, వారు భూములను ఇవ్వరని, అందువల్ల ముందు ప్రజలకు నమ్మకం కలిగించిన తరువాతే ముందడుగు వేస్తున్నామని తెలిపారు.

ప్రతి లోక్ సభ నియోజకవర్గంలో ఓ నైపుణ్యాభివృద్ధి శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రస్తుతం 13 జిల్లాల్లో 6 విమానాశ్రయాలు ఉన్నాయని, వచ్చే ఐదు సంవత్సరాల్లో మరో నాలుగు విమానాశ్రయాలను నిర్మిస్తామని వైఎస్ జగన్, పారిశ్రామికవేత్తలకు, దౌత్యాధికారులకు తెలియజేశారు. రాష్ట్రంలో నదులను అనుసంధానం చేయడానికి కట్టుబడివున్నామని, అందుకు సహకరించాలని పిలుపునిచ్చారు.

More Telugu News