Sushma Swaraj: తెలంగాణ ప్రజలారా... నేను మీ చిన్నమ్మను... నన్ను మరువద్దు!: నాడు సుష్మా స్వరాజ్ భావోద్వేగ ప్రసంగం

  • తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు
  • బీజేపీ సీనియర్ నేతలను ఒప్పించిన సుష్మా
  • చరిత్రలో నిలిచిన నాటి సుష్మా ప్రసంగం
2014 ఫిబ్రవరి 18... లోక్‌ సభలో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లుపై అత్యంత కీలకమైన చర్చ జరుగుతున్న వేళ, అప్పటికే తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాల్సిందేనని పట్టుబట్టి, బీజేపీ సీనియర్ నేతలను ఒప్పించిన సుష్మా స్వరాజ్ భావోద్వేగ ప్రసంగాన్ని చేశారు. "ఆరు దశాబ్దాలుగా పడుతున్న ప్రసవ వేదనను తీర్చే సమయం వచ్చేసింది. ఎన్నో త్యాగాలు, మరెన్నో బలిదానాల మధ్య, పండంటి తెలంగాణ బిడ్డ జన్మించనుంది. మేమిచ్చిన వాగ్దానం మేరకు మా మాటను నిలబెట్టుకున్నాం. నేడు జన్మించనున్న తెలంగాణ బిడ్డ ఎదిగేందుకు పాటుపడతాం. తెలంగాణ ప్రజలారా, ఈ చిన్నమ్మను గుర్తుపెట్టుకోండి" అని సుష్మా స్వరాజ్ కోరారు.

తెలంగాణ వాసులకు తాను చిన్నమ్మనని చెప్పుకునే సుష్మా, అంతకుముందు కూడా పలుమార్లు ఈ ప్రాంత వాసులకు ప్రత్యేక రాష్ట్రం వస్తుందన్న భరోసాను ఇచ్చారు. రాష్ట్ర ఏర్పాటుకు తాను అండగా ఉంటానంటూ చెప్పిన బీజేపీ తొలి మహిళా నేత కూడా సుష్మా స్వరాజే. ఢిల్లీ వేదికగా టీఆర్ఎస్ నిర్వహించిన ప్రతి ఆందోళనకు ఆమె హాజరయ్యారు. ఆపై రాష్ట్ర ఏర్పాటుపై పార్టీ అగ్రనేతలు అద్వానీ, రాజ్ నాథ్ సింగ్, గడ్కరీ, జైట్లీలను ఒప్పించారు. తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన సుష్మా, నిన్న రాత్రి కన్నుమూయడంతో తెలంగాణ వాసులు ఆమెను గుర్తు చేసుకుంటున్నారు. విభజన నాడు సుష్మా చేసిన ప్రసంగం చరిత్రలో నిలిచిపోతుందని అంటూ నివాళులు అర్పిస్తున్నారు.
Sushma Swaraj
Passes Away
Died
Telangana
Lok Sabha

More Telugu News