Jana Sena: ప్రాణం పోయినా జనసేనను ఏ పార్టీలోనూ విలీనం చేయను: పవన్

  • పార్టీని బీజేపీలో విలీనం చేస్తారనేది తప్పుడు ప్రచారం
  • ఆ ప్రచారాన్ని నమ్మొద్దు
  • పార్టీని నడిపేందుకు వేల కోట్లు అవసరం లేదు
జనసేన విలీనంపై గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలను ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఖండించారు. తన ప్రాణం పోయినా జనసేనను ఏ పార్టీలోనూ విలీనం చేయబోనని స్పష్టం చేశారు. బీజేపీలో జనసేనను విలీనం చేస్తారంటూ కొందరు పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వాటిని నమ్మొద్దని కార్యకర్తలు, అభిమానులను కోరారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

తనను ఓడించిన ఈ నేల నుంచే తనపై నమ్మకంతో ఓటేసిన ప్రతి ఒక్కరికీ ఓ విషయం చెప్పాలనుకుంటున్నానని, జనసేనను ఏ పార్టీలోనూ విలీనం చేయబోనని పవన్ పునరుద్ఘాటించారు. టీడీపీతో జనసేన లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుందని ఎన్నికల సమయంలో తప్పుడు ప్రచారం చేశారని పవన్ అన్నారు. తాను ఎవరితోనూ లోపాయికారీ ఒప్పందాలు పెట్టుకోనని, ఏదైనా ఉంటే అందరికీ చెప్పే చేస్తానని పేర్కొన్నారు. పార్టీని నడపడానికి వేల కోట్ల రూపాయలు అవసరం లేదని, టన్నుల కొద్దీ ఆశయం ఉంటే చాలని పవన్ అన్నారు.  
Jana Sena
Pawan Kalyan
Andhra Pradesh

More Telugu News