విశాఖపట్నంలో విద్యార్థినులకు లైంగిక వేధింపులు.. ఇద్దరు టీచర్లను సెలవుపై పంపిన ఉన్నతాధికారులు!
- విశాఖలోని అనంతగిరి మండలంలో ఘటన
- గిరిజన సంక్షేమ స్కూలులో ఇద్దరు టీచర్ల నిర్వాకం
- విచారణకు ఆదేశించిన ఐటీడీఏ ఉన్నతాధికారులు
జిల్లాలోని అనంతగిరి మండలం గిరిజన సంక్షేమ హైస్కూలులో 61 మంది బాలికలు సహా 440 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి పాఠాలు చెప్పేందుకు నలుగురు పురుష, 8 మంది మహిళా టీచర్లు ఉన్నారు. అయితే వీరిలో ఇద్దరు మగ టీచర్లు పదో తరగతి అమ్మాయిలను లైంగికంగా వేధిస్తున్నారు. గత కొద్దిరోజులుగా సాగుతున్న ఈ తతంగంపై అమ్మాయిలు భయంతో మౌనంగా ఉండిపోయారు. అయితే ఈ వేధింపులు శ్రుతిమించడంతో స్థానిక కమ్యూనిస్టు నాయకులతో కలిసి విద్యార్థినులు ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్ మెంట్ ఏజెన్సీ(ఐటీడీఏ) అధికారులకు ఫిర్యాదు చేశారు.
వెంటనే స్పందించిన ఉన్నతాధికారులు ఇద్దరు టీచర్లను సెలవుపై పంపారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. ఈ విషయమై అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ సూర్యనారాయణ మాట్లాడుతూ.. ఇద్దరు ఉపాధ్యాయులు దోషులుగా తేలితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. దీంతో శాంతించిన విద్యార్థులు, గ్రామస్తులు ధన్యవాదాలు చెప్పి వెళ్లిపోయారు. ఈ పాఠశాలను ఐటీడీఏనే నిర్వహిస్తోంది.