Andhra Pradesh: బీజేపీ నాయకుల పరిస్థితి ‘కొత్త బిచ్చగాళ్లు’లా తయారైంది: టీ-కాంగ్రెస్ నేత పొన్నం
- ఇతర పార్టీల నాయకులను చేర్చుకుంటే బీజేపీ బలోపేతమైనట్టా?
- ‘మేము ప్రత్యామ్నాయం’ అని బీజేపీ చెప్పుకోవడం సిగ్గుచేటు
- మా పార్టీ గురించి మాట్లాడే హక్కు బీజేపీకి లేదు
తెలుగు రాష్ట్రాల్లోని ఇతర పార్టీల నాయకులను తమ పార్టీలో చేర్చుకుంటున్న బీజేపీపై టీ-పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. హైదరాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బీజేపీ నాయకుల పరిస్థితి ‘కొత్త బిచ్చగాళ్లు’లా తయారైందని తీవ్ర విమర్శలు చేశారు. ఇతర పార్టీలకు చెందిన నాయకులను బీజేపీలో చేర్చుకుంటే ఆ పార్టీ బలోపేతమవుతుందా? అని ప్రశ్నించారు.
తెలంగాణ ప్రయోజనాల కోసం ఏదైనా చేసి ఉంటే, ఆ విషయం చెప్పుకుని ప్రజలను, నాయకులను ఆకర్షించుకునే ప్రయత్నం చేయాలని టీ-బీజేపీ నేతలకు సూచించారు. రాజకీయ కారణాలతోనో, అసంతృప్తితోనో, అలకతోనో ఉన్న నాయకులను బేరం చేసుకుని బీజేపీలో చేర్చుకుంటూ, ఫలానా పార్టీకి ‘మేము ప్రత్యామ్నాయం’ అని చెప్పుకోవడం సిగ్గుచేటని దుమ్మెత్తిపోశారు. తెలంగాణలో 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కలేదని, ఇలాంటి నాయకులకు తమ పార్టీ గురించి మాట్లాడే హక్కు లేదని అన్నారు.