Sachin Tendulkar: క్రికెట్ లో ప్రకంపనలు పుట్టిస్తున్న ఆంధ్రా 'టెండూల్కర్'

  • అనంతపురం జిల్లాలో అర్జున్ టెండూల్కర్
  • సంచలనాలు సృష్టిస్తున్న యువ ఆటగాడు
  • తన ఆరాధ్య క్రికెటర్ టెండూల్కర్ పేరును కొడుక్కి పెట్టుకున్న అనంతపురం జిల్లా వాసి

భారత క్రికెట్లోనే కాదు, ప్రపంచంలోనే సచిన్ టెండూల్కర్ అంతటి ఆటగాడు ఎంతో అరుదు. ఆటతోనే కాకుండా వ్యక్తిత్వంతోనూ అందరి మనసులు చూరగొనడం సచిన్ కే సాధ్యమైంది. సచిన్ ఆడుతున్న రోజుల్లో అతడి పేరును తమ పిల్లలకు పెట్టుకోవడం చాలా సందర్భాల్లో జరిగింది. అయితే, సచిన్ ఇంటిపేరును తన కొడుక్కి పెట్టుకోవడమే కాదు, సచిన్ అంతటివాడ్ని చేసేందుకు ఓ తండ్రి పడుతున్న తాపత్రయం మీడియా దృష్టిని ఆకర్షించింది.

ఆ తండ్రికి విశేషమైన గుర్తింపు తెచ్చిపెడుతున్న ఆ తనయుడి పేరు అర్జున్ టెండూల్కర్. వాస్తవానికి సచిన్ కొడుకు పేరు కూడా అర్జునే. అనంతపురం జిల్లా గొట్లూరుకు చెందిన ఆదినారాయణ తన నలుగురు పిల్లల్లో ఒక అబ్బాయికి అర్జున్ టెండూల్కర్ అని పేరు పెట్టుకున్నాడు. సచిన్ పై ఆరాధనతోనే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

అర్జున్ విషయానికొస్తే, అండర్-16 జిల్లా స్థాయిలో విధ్వంసక బ్యాటింగ్ తో తన పేరులోని టెండూల్కర్ కు సార్థకత చేకూరుస్తున్నాడు. ఇటీవలే కడప జిల్లా జట్టుపై ట్రిపుల్ సెంచరీ సాధించి ఔరా అనిపించాడు. 215 బంతుల్లో 308 పరుగులు చేశాడు. అర్జున్ స్కోరులో 39 ఫోర్లు, 13 సిక్సులు బాదాడు. దాంతో ఈ యువ ఆటగాడి పేరు ఆంధ్రా క్రికెట్ వర్గాల్లో మార్మోగింది.

అర్జున్ తండ్రి ఆదినారాయణ క్రికెట్ పై మక్కువతో తన నలుగురు పిల్లల్లో ముగ్గురికి క్రికెట్ లో శిక్షణ ఇప్పిస్తున్నాడు. క్రికెట్ కోసమే తన కుటుంబాన్ని గొట్లూరు నుంచి అనంతపురంకు తరలించాడు. ఆదినారాయణ కృషి ఫలించి, అర్జున్ టెండూల్కర్ జిల్లాస్థాయిలో మెరుగైన ప్రదర్శన కనబరుస్తూ రాష్ట్ర జట్టులో స్థానం కోసం ఉరకలేస్తున్నాడు.

More Telugu News