Ashu Reddy: టాలీవుడ్ బిగ్ బాస్-3 విజేత ఆమేనట!

  • పవన్ డై హార్డ్ ఫ్యాన్ గా ఉన్న అషూ రెడ్డి
  • గుండెలపై టాటూ వేయించుకుని అభిమానం
  • ఆమెనే గెలిపిద్దామంటున్న పవన్ ఫ్యాన్స్
టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు ఉన్న అభిమాన బంధుగణం లెక్కలను ఎవరూ తేల్చలేరు. ఆయనకు ఉన్న క్రేజ్ అటువంటిది. ఆ అభిమానమే బిగ్ బాస్ సీజన్ 1లో శివబాలాజీని విజేతగా నిలిపింది. తాను పవన్ కల్యాణ్ కు ఫ్యాన్ నని, హౌస్ లోకి ఎంటర్ కాకముందే శివబాలాజీ చేసిన వ్యాఖ్యలు ఆయనకు పవర్ స్టార్ ఫ్యాన్స్ అండగా నిలిచేలా చేయగా, విజేతయ్యాడు.

ఇప్పుడు అదే తరహాలో మరో పవర్ స్టార్ డైహార్డ్ ఫ్యాన్ సీజన్-3లో ఉండటంతో, విజేత ఎవరో ఇప్పటికే ఖరారైపోయిందని లీకులు వస్తున్నాయి. తన డబ్ స్మాష్ వీడియోలతో పాటు, కాస్తంత సమంత పోలికలున్న ఆషూ రెడ్డి ఈ సీజన్ విజేతగా నిలుస్తుందట. సోషల్ మీడియాలో తనకున్న క్రేజ్ తో హౌస్ లోకి ప్రవేశించిన ఆమె, ఇప్పుడు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పై ఆశలు పెంచుకోగా, అందుకు తగ్గట్టుగానే పవన్ ఫ్యాన్స్ ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారట.

కాగా, తాను పవన్‌ కల్యాణ్‌ కి వీరాభిమానినని ఆషూ రెడ్డి చాలా సార్లు చెప్పుకుంది. కత్తి మహేశ్, పవన్ ఫ్యాన్స్ మధ్య వివాదం జరుగుతున్న వేళ, తన గుండెలపై పవన్‌ కల్యాణ్ అని టాటూ వేయించుకుని, ఆ ఫోటోను ఏ మాత్రం సంకోచించకుండా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, "నేను కూడా పవన్ అని టాటూ వేయించుకున్నాను. అంటే ఆయనతో నాకు ఎఫైర్ ఉన్నట్లా?" అని ప్రశ్నించి పెను సంచలనాన్నే సృష్టించింది.

అప్పట్లో ఆమె పోస్ట్ చేసిన ఈ టాటూ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. పవన్ ఫ్యాన్స్ అంతా ఈ చిత్రాన్ని షేర్ మీద షేర్ చేస్తూ, ఆమెను గెలిపించాలని ప్రచారం చేస్తున్నారు. ఇక ఆషూ రెడ్డి ఆర్మీ తయారైనట్టేనేమో.
Ashu Reddy
Biggboss
Pawan Kalyan
Winner

More Telugu News