SVBC: ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ వ్యాఖ్యలను ఖండించిన పోసాని కృష్ణమురళి

  • జగన్ సీఎం కావడం టాలీవుడ్ కు ఇష్టం లేదన్న పృథ్వీ
  • ఈ వ్యాఖ్యలు ‘బిగ్ మిస్టేక్’ 
  • సినిమా వాళ్లు జగన్ ని అభినందించాలనుకున్నారు
  • ఈ విషయం పృథ్వీకి తెలియకపోవడం దురదృష్టకరం 
ఏపీలో వైసీపీ గెలవడం, వైఎస్ జగన్ సీఎం కావడం తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఇష్టం లేదని, అందుకే, ఎవరూ ఆయన్ని అభినందించలేదని ఎస్వీబీసీ చైర్మన్, వైసీపీ నాయకుడు, ప్రముఖ హాస్యనటుడు పృథ్వీరాజ్ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలను అదే పార్టీకి చెందిన వ్యక్తి, ప్రముఖ సినీ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి ఖండించారు. పృథ్వీరాజ్ తొందరపడి ఈ వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. జగన్ సీఎం కావడం సినీ పరిశ్రమ పెద్దలకు ఇష్టం లేదన్న వ్యాఖ్యలు ‘బిగ్ మిస్టేక్’గా అభివర్ణించారు. సీఎం అయిన జగన్ ని కలిసి, ఓ పూల దండ వేసి, అభినందిస్తే, ఆయనపై ప్రేమ ఉన్నట్టు, లేకపోతే లేదనుకుంటే పొరపాటేనని అభిప్రాయపడ్డారు.

గత ఎన్నికల్లో చంద్రబాబు గెలిచారని, అప్పుడు, తానేమి చంద్రబాబును కలిసి అభినందించలేదని, అంటే, చంద్రబాబు సీఎం కావడం తనకు ఇష్టం లేదని అనుకోవడం కరెక్టు కాదుగా అని అన్నారు. సినిమా వాళ్లందరూ కలిసి జగన్ ని అభినందించేందుకు టైమ్ ఇస్తారా? అని ప్రముఖ నిర్మాత సురేశ్ బాబు ఇప్పటికే ఫోన్ చేసి అడిగారని, ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత సమాచారం తెలియజేస్తామని సీఎం ఆఫీసు నుంచి ఆయనకు సమాచారం పంపారని చెప్పారు. ఆ విషయం సినీ పరిశ్రమలోని పెద్దలందరికీ తెలుసని, ఈ విషయం పృథ్వీకి తెలియకపోవడం దురదృష్టకరమని అన్నారు. 
SVBC
Prudhvi Raj
Posani Krishna Murali
Tollywood

More Telugu News