Allahabad: దేశ చరిత్రలో తొలిసారి... హైకోర్ట్ సిట్టింగ్ న్యాయమూర్తిపై సీబీఐ విచారణ!

  • అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న ఎస్ఎన్ శుక్లా
  • గతంలోనే అవినీతి ఆరోపణలు
  • సీబీఐ విచారణకు అనుమతించిన రంజన్ గొగోయ్
భారత దేశ చరిత్రలో తొలిసారిగా ఓ సిట్టింగ్ జడ్జిపై సీబీఐ విచారణకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. అలహాబాద్ హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ ఎస్ఎన్ శుక్లాపై సీబీఐ విచారణకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ అనుమతించారు. శుక్లాపై చాలా కాలంగా అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. 2017-2018 విద్యా సంవత్సరానికి సంబంధించి, ప్రైవేటు మెడికల్‌ కళాశాలల్లో అడ్మిషన్ల వ్యవహారంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను సైతం ఆయన లెక్కచేయలేదని ఆరోపణలు వచ్చాయి.

ఈ వ్యవహారాలపై సీబీఐ విచారణకు ప్రభుత్వం ఆదేశించినా, ఆయన సిట్టింగ్‌ జడ్జి కావడంతో, విచారణ చేపట్టాలంటే సుప్రీం చీఫ్ జస్టిస్ అనుమతి తప్పనిసరైంది. దీంతో సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, విచారణకు అనుమతిస్తున్నట్లు గొగోయ్ వెల్లడించారు. కాగా, శుక్లాను తక్షణమే తొలగించాలని గొగోయ్ గతంలోనే కేంద్రానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. తమ అంతర్గత విచారణలో జస్టిస్ శుక్లా దుష్ప్రవర్తన రుజువైందని కూడా ఆయన పేర్కొన్నారు. ఆయనపై కేసు నమోదైందని గుర్తుచేశారు.

సీబీఐ విచారణపై మరో ఉన్నత న్యాయమూర్తి దీపక్‌ మిశ్రా స్పందిస్తూ, జస్టిస్‌ శుక్లా వెంటనే రాజీనామా చేయాలని, లేదంటే స్వచ్ఛంద పదవీవిరమణను ఎంచుకోవచ్చని సూచించారు. అలా చేసినా సీబీఐ విచారణ మాత్రం ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేశారు.
Allahabad
Justis SN Sukla
High Court
Judge
Ranjan Gogoi

More Telugu News