Rajya Sabha: ట్రిపుల్ తలాక్ రద్దు బిల్లుకు రాజ్యసభ ఆమోదం

  • రాజ్యసభలో ముగిసిన ఓటింగ్
  • బిల్లుకు అనుకూలంగా 99 ఓట్లు
  • వ్యతిరేకంగా 84 ఓట్లు
ఎంతోకాలంగా చర్చనీయాంశంగా ఉన్న ట్రిపుల్ తలాక్ రద్దు బిల్లుకు రాజ్యసభ ఆమోదం లభించింది. ట్రిపుల్ తలాక్ బిల్లుపై రాజ్యసభలో ఈ సాయంత్రం ఓటింగ్ నిర్వహించారు. బిల్లుకు అనుకూలంగా 99, వ్యతిరేకంగా 84 ఓట్లు లభించాయి. ఇటీవలే లోక్ సభలో కూడా ట్రిపుల్ తలాక్ బిల్లుకు ఆమోదముద్ర పడింది. ఉభయసభల్లో ఈ బిల్లుకు అడ్డంకులు తొలగిపోవడంతో ఇకమీదట ట్రిపుల్ తలాక్ రద్దు కానుంది.

సభలో మొత్తం సభ్యుల సంఖ్య 245 కాగా, ఆమోదానికి 121 ఓట్లు కావాలి. అయితే, పలు పార్టీలు బిల్లును వ్యతిరేకించగా, మరికొన్ని పార్టీలు ఓటింగ్ కు దూరంగా ఉన్నాయి. దాంతో సభలో అందుబాటులో ఉన్న సభ్యులతోనే ఓటింగ్ నిర్వహించారు. ఉభయసభల ఆమోదం పొందిన ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం కూడా లభిస్తే దేశంలో ట్రిపుల్ తలాక్ రద్దు కానుంది.  

ట్రిపుల్ తలాక్ పద్ధతిని ఇస్లామిక్ దేశాలు కూడా వ్యతిరేకిస్తున్నాయని, పలు దేశాలు ఇప్పటికే తలాక్ పై నిషేధం విధించాయని చెబుతూ ఎన్డీయే ఎప్పటినుంచో ఇతర పార్టీల మద్దతు కూడగట్టేందుకు పోరాడుతోంది. ఇస్లామిక్ దేశాలు సైతం ట్రిపుల్ తలాక్ ను వ్యతిరేకిస్తున్న తరుణంలో లౌకిక దేశమైన భారత్ లో ఎందుకు రద్దు చేయలేమంటూ మోదీ సర్కారు ఈ బిల్లును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.

అటు, ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు 2017లోనే చెప్పింది. ఇన్నాళ్లకు లోక్ సభ, రాజ్యసభలో దీనిపై బిల్లు ఆమోదం పొందింది. ఈ బిల్లు త్వరలోనే రాష్ట్రపతి వద్దకు వెళ్లనుంది.
Rajya Sabha
Triple Talaaq

More Telugu News