Hyderabad: ఆషాడమాసంలో మూడో ఆదివారం... బోనమెత్తిన భాగ్యనగరి

  • ముస్తాబైన ఎల్లమ్మ, పోచమ్మ ఆలయాలు
  • బోనాలతో తరలివస్తున్న మహిళలు
  • లాల్ దర్వాజాలో ప్రత్యేక ఏర్పాట్లు
ఆషాడ మాసంలో మూడో ఆదివారం సందర్భంగా హైదరాబాద్ లోని అన్ని పోచమ్మ, ఎల్లమ్మ ఆలయాలు ముస్తాబు కాగా, ఈ తెల్లవారుజాము నుంచి మహిళలు బోనాలతో తరలిరావడంతో సందడి వాతావరణం నెలకొంది. ఇదే సమయంలో లాల్‌ దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయంలోనూ బోనాల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వీధుల్లో ఉన్న అమ్మవారి దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. బోనాల ఉత్సవాలను ఏ విధమైన ఆటంకాలు లేకుండా జరిపించేందుకు ఆర్ అండ్ బీ,, జీహెచ్‌ఎంసీ సిబ్బంది, పోలీసులు ఏర్పాట్లు చేశారు. ఆలయాల వద్ద ప్రత్యేక బందోబస్తును నిర్వహిస్తున్నారు.

కాగా, లాల్ దర్వాజా ఆలయంలో మాజీ రాజ్యసభ సభ్యుడు దేవేందర్‌ గౌడ్‌ చేతుల మీదుగా మహాభిషేకం జరుగుతుందని, రాత్రి 8 గంటలకు శాంతి కల్యాణం ఉంటుందని ఆలయ కమిటీ ప్రకటించింది. మంత్రులు మహమూద్‌ అలీ, ఇంద్రకరణ్‌ రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్ తదితరులతో పాటు డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్, మాజీ ఎంపీలు కవిత, విజయశాంతి తదితరులు ఆలయానికి రానున్నారని అన్నారు.
Hyderabad
Bonalu
Laldarwaja
Mahankali

More Telugu News