Jammu And Kashmir: కశ్మీర్‌పై కేంద్రం కీలక నిర్ణయం.. ఆర్టికల్ 35 ఎ రద్దు దిశగా అడుగులు?

  • కశ్మీర్‌కు పదివేల మంది పారా మిలటరీ బలగాల తరలింపు
  • క్షేత్రస్థాయిలో ఎదురయ్యే హింసను అదుపు చేసేందుకు కేంద్రం సిద్ధం
  • జాతి వ్యతిరేకుల పేర్లతో జాబితా సిద్ధం
కశ్మీర్‌లో అమల్లో ఉన్న ఆర్టికల్ 35ఎ అధికరణను ఎత్తివేస్తామని తొలి నుంచీ చెబుతున్న కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. రాజ్యాంగంలోని ఈ అధికరణ కశ్మీరీలకు ప్రత్యేక హక్కులు కల్పిస్తోంది. ఇప్పుడు దీనిని రద్దు చేయడం ద్వారా అక్కడ అందరికీ సమాన హక్కులు కల్పించాలన్నది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం. ఆర్టికల్‌ను రద్దు చేస్తే ఎదురయ్యే పరిస్థితులను ముందే ఊహించిన కేంద్రం కశ్మీర్‌కు ఏకంగా 10 వేల మంది పారా మిలటరీ జవాన్లను పంపబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ కశ్మీర్‌లో పర్యటించిన వచ్చిన తర్వాత కశ్మీర్‌కు ప్రత్యేక బలగాలను తరలించాలన్న నిర్ణయం వెలువడడంతో ఆర్టికల్ 35ఎ రద్దుపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ వార్తలను బీజేపీ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ కొట్టిపడేశారు. అవన్నీ వదంతులేనని పేర్కొన్నారు. అయితే, జరుగుతున్నది మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉందని సమాచారం.

ఆర్టికల్ 35ఎను రద్దు చేస్తే క్షేత్రస్థాయిలో ఎదురయ్యే పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ముందస్తుగా సిద్ధమవుతోందని చెబుతున్నారు. రద్దును వ్యతిరేకించే నెపంతో జాతి వ్యతిరేక శక్తులు హింసకు పాల్పడే అవకాశం ఉందని, దీనిని అదుపు చేసేందుకు ప్రత్యేక బలగాల తరలింపు అని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

కేంద్రం ఆదేశాలతో బలగాల తరలింపు మొదలైందని, ప్రత్యేక విమానాల్లో బలగాలు శ్రీనగర్ విమానాశ్రయానికి చేరుకుంటున్నాయని సమాచారం. ఇక, అల్లర్లు సృష్టించే అవకాశం ఉందని భావిస్తున్న వారి పేర్లతో జాబితా కూడా సిద్ధమైందని, జాతి వ్యతిరేక శక్తులను ముందుగానే అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా ఆర్టికల్ 35ఎ రద్దును వ్యతిరేకిస్తున్న కశ్మీర్‌లోని ప్రధాన పార్టీలైన  నేషనల్‌ కాన్ఫరెన్స్‌, పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ, జమ్మూ అండ్‌ కశ్మీర్‌ పీపుల్స్‌ మూవ్‌మెంట్ నేతలపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు సమాచారం.
Jammu And Kashmir
Article 35A
BJP

More Telugu News