Anantapur District: బిస్కెట్ ప్యాకెట్ ఎత్తుకెళ్లిన కోతి కోసం వెళ్లి... మృత్యువాత!

  • అనంతపురం జిల్లా ముదిగుబ్బలో ఘటన
  • పెద్దమ్మ ఆలయం వద్ద వ్యాపారం చేస్తున్న రాజు
  • బిస్కెట్ ప్యాకెట్ల కోసం వెళితే, తగిలిన 11 కేవీ లైన్
తన దుకాణంలోని బిస్కెట్‌ ప్యాకెట్లను ఓ కోతి ఎత్తుకెళ్లిందన్న కోపంతో దాని వెంటపడిన ఓ యువకుడు, ప్రమాదవశాత్తూ కరెంట్ షాక్ తో మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే, ముదిగుబ్బ పట్టణంలోని పెద్దమ్మ ఆలయం వద్ద రాజు (25) అనే వ్యక్తి చిరువ్యాపారం నిర్వహించుకుంటూ, తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.

 ఈ ప్రాంతంలో కోతుల బెడద అధికం. రాజు నిర్వహిస్తున్న షాప్ లోకి చొరబడిన ఓ మర్కటం, తన చేతికి అందిన బిస్కెట్ ప్యాకెట్లను ఎత్తుకెళ్లి, పక్కనే ఉన్న రేకుల షెడ్ పై కూర్చుంది. దాన్ని తరిమేసి, బిస్కెట్ ప్యాకెట్లు తెచ్చుకోవాలన్న ఆలోచనతో రాజు అదే షెడ్ పైకి కర్ర తీసుకుని ఎక్కాడు. పైనే ఉన్న 11 కేవీ విద్యుత్ తీగలు ప్రమాదవశాత్తూ రాజుకు తగలడంతో విద్యుదాఘాతానికి గురై, అక్కడికక్కడే మరణించాడు. దీంతో రాజు కుటుంబంలో విషాదం నెలకొనగా, ఎదిగొచ్చిన బిడ్డ మరణాన్ని చూసిన రాజు తల్లిదండ్రులు నాగలక్ష్మి, గంగన్న కన్నీరుమున్నీరయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాఫ్తు ప్రారంభించారు.
Anantapur District
Mudigubba
Current Shock
Died
Raju

More Telugu News