Anantapur District: బీమా డబ్బు కోసం భర్త హత్యకు స్కెచ్‌... బెడిసికొట్టిన పన్నాగం!

  • డబ్బు వ్యామోహంలో ఓ మహిళ దురాలోచన
  • అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం వంగనూరులో వెలుగు చూసిన నిజం
  • నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

డబ్బు ఎంత పాపానికైనా ఒడిగట్టేలా చేస్తుంది. ధన వ్యామోహం ఆత్మీయానుబంధాలను చంపేస్తుంది. ఇది అక్షర సత్యమని నిరూపించింది ఆ మహిళ. బీమా డబ్బు కోసం ఏకంగా భర్తనే హత్య చేయించేందుకు సిద్ధపడింది. అదృష్టవశాత్తు వారి ప్లాన్‌ బెడిసికొట్టడంతో అతను బతికిపోయాడు. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం వంగనూరులో వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలావున్నాయి.

 అనంతపురం జెడ్పీ కార్యాలయంలో టెక్నికల్‌ అధికారిగా విధులు నిర్వహిస్తున్న నిషారుద్దీన్‌, గౌషియా దంపతులు. మనస్పర్థల కారణంగా కొద్దిరోజులుగా ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారు. భర్త ప్రభుత్వ ఉద్యోగి కావడంతో అతన్ని హత్య చేస్తే అతని పేరున ఉన్న రూ.14 లక్షల బీమా సొమ్ముతోపాటు కారుణ్య నియామకంలో ఉద్యోగం వస్తుందని గౌషియా భావించింది. విషయాన్ని తన స్నేహితురాలు, మహిళా మండలి జిల్లా అధ్యక్షురాలైన నిర్మలాదేవికి తెలిపింది.

అనంతరం నిర్మలాదేవి భర్త కులశేఖర్‌, అతని స్నేహితుడు గార్లదిన్నె మండలం తిమ్మంపేటకు చెందిన రమణారెడ్డితో చర్చించింది. భర్త హత్యకు రూ.5 లక్షలు ఇస్తానని చెప్పింది. దీంతో వీరిద్దరూ ఓ హత్య కేసులో నిందితులైన తాడిపత్రికి చెందిన కృష్ణారెడ్డి, నాగేంద్రలతో ఒప్పందం కుదుర్చుకుని రూ.లక్ష అడ్వాన్స్‌గా ఇచ్చారు. పని పూర్తయ్యాక మిగిలిన మొత్తం ఇస్తామని చెప్పారు.

అయితే నిందితులు ప్లాన్‌ అమలు చేయకముందే వీరి పథకంపై తాడిపత్రి పోలీసులకు సమాచారం అందడంతో ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయం వెలుగు చూసింది. వీరి వద్ద నుంచి వేటకొడవలి, పిడిబాకు, కారంపొడి, నాలుగు సెల్‌ఫోన్‌లతోపాటు 40 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. కాగా, హత్యకు సూత్రధారి అయిన గౌషియా పరారీలో ఉందని పోలీసులు తెలిపారు.

More Telugu News