Donald Trump: ట్రంప్ వ్యాఖ్యలకు దీటుగా బదులిచ్చిన ఆఫ్ఘన్ ప్రభుత్వం

  • తాను తలుచుకుంటే భూమిపై ఆఫ్ఘనిస్థాన్ ఉండదన్న ట్రంప్
  • ట్రంప్ వ్యాఖ్యలపై ఆఫ్ఘన్ ప్రభుత్వం అసంతృప్తి
  • దౌత్యవేత్తల ద్వారా మరింత స్పష్టతనివ్వాలని కోరిన ఆఫ్ఘన్ అధ్యక్షుడు
తాను తలుచుకుంటే ఈ భూమండలం మీద ఆఫ్ఘనిస్థాన్ ఉండదంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఆఫ్ఘన్ ప్రభుత్వాన్ని అసంతృప్తికి గురిచేశాయి. ట్రంప్ వ్యాఖ్యలపై ఆఫ్ఘన్ ప్రభుత్వం దీటుగా బదులిచ్చింది. తమ దేశానికి చెందిన నాయకత్వం లేకుండా తమ తలరాతలను ఇతర దేశాల వారెవరూ నిర్ణయించలేరని పేర్కొంది. అమెరికా వంటి అగ్రరాజ్యం పట్ల తమకు గౌరవం ఉందని తెలిపింది. తమ దేశంలో ప్రశాంత వాతావరణం కోసం అమెరికా చర్యలకు తాము సహకరిస్తున్నామని ఆఫ్ఘన్ వర్గాలు స్పష్టం చేశాయి.

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సమక్షంలో ట్రంప్ తమ దేశంపై చేసిన వ్యాఖ్యల పట్ల దౌత్యవేత్తల ద్వారా మరింత స్పష్టతనివ్వాలని ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ అమెరికాను కోరారు. అటు, ఆఫ్ఘన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ కూడా ట్రంప్ వ్యాఖ్యల పట్ల స్పందిస్తూ, అమెరికా అధ్యక్షుడి మాటలు ఆఫ్ఘన్ ప్రజలను కించపరిచేలా ఉన్నాయని మండిపడ్డారు.
Donald Trump
Afghanistan

More Telugu News