Telangana: కొడంగల్ ప్రజలకు చేసిన ద్రోహానికి హరీశ్ రావు శిక్ష అనుభవిస్తున్నాడు!: కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి

  • ప్రశ్నించాలనే ప్రజలు నన్ను గెలిపించారు
  • కొడంగల్ ప్రజల ఆదరణ, ప్రేమను మర్చిపోను
  • కోస్గిలో సన్మాన సభలో పాల్గొన్న రేవంత్ రెడ్డి
ప్రశ్నించేవాడు లేకుంటే పాలించేవాడిదే రాజ్యం అవుతుందని కాంగ్రెస్ నేత మల్కాజ్ గిరి లోక్ సభ సభ్యుడు రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ విషయాన్ని గుర్తించిన తెలంగాణ ప్రజలు తనను ఎన్నికల్లో గెలిపించారని వ్యాఖ్యానించారు. తాను ఢిల్లీలో ఉన్నప్పటికీ కొడంగల్ ప్రజల ఆదరణ, ప్రేమను మర్చిపోనని స్పష్టం చేశారు. కొడంగల్ లోని కోస్గిలో నిర్వహించిన సన్మాన సభలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేలా పనిచేయాలని శ్రేణులకు సూచించారు.

కేంద్రంతో పోరాడి నిధులు తెచ్చే బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఓడించేందుకు కేసీఆర్ హరీశ్ రావును పంపారనీ, ఇప్పుడు హరీశ్ రావు పరిస్థితి ఏమైందో ప్రజలంతా చూస్తున్నారని వ్యాఖ్యానించారు. కొడంగల్ ప్రజలకు చేసిన ద్రోహానికి హరీశ్ రావు శిక్ష అనుభవిస్తున్నాడని వ్యాఖ్యానించారు. పొట్టివాడ్ని పొడుగువాడు కొడితే, పొడుగువాడిని పోశమ్మ కొట్టిందన్నట్లుగా హరీశ్ పరిస్థితి తయారైందని ఎద్దేవా చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.
Telangana
Congress
Revanth Reddy
KCR
Harish Rao
TRS

More Telugu News