Telangana: తెలంగాణలో మరో ఆరు విమానాశ్రయాల ఏర్పాటుకు సన్నాహాలు!

షార్ట్స్‌లో చూడండి
రాష్ట్రంలో ఆరు కొత్త విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలని కేసీఆర్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ విమానాశ్రయాల ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు నేరుగా ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)ని సంప్రదించిన ప్రభుత్వం, కన్సల్టెన్సీ ఫీజుగా రూ. 4.5 కోట్లు చెల్లించేందుకు కూడా అంగీకరించింది. ఒకసారి సాధ్యాసాధ్యాలపై నిర్ణయాలు వెలువడితే, పనులు వేగంగా జరుగుతాయని ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు. విమానాశ్రయాలు నిర్మించాలని భావించే ప్రాంతాల్లో సర్వే, తదితర పనుల నిమిత్తం మౌలిక వసతులు, పెట్టుబడుల విభాగం ఇప్పటికే రూ. 1.06 కోట్లను విడుదల చేసిందని తెలిపారు.

ఈ విమానాశ్రయాలు వరంగల్, పెద్దపల్లి, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్ ప్రాంతాల్లో ఏర్పాటు కానున్నాయి. వరంగల్ సమీపంలోని మామ్నూరులో, పెద్దపల్లికి సమీపంలోని బసంత్ నగర్ లో, నిజామాబాద్ సమీపంలోని జక్రాన్ పల్లిలో, ఆదిలాబాద్ పట్టణానికి దగ్గరగా, ఖమ్మం సమీపంలోని కొత్త గూడెంలో, మహబూబ్ నగర్ సమీపంలోని అడ్డాకులలో ఇప్పటికే స్థలాలను గుర్తించడం జరిగింది.

 కాగా, వరంగల్ విషయంలో మాత్రం కొన్ని సాంకేతిక అంశాలు అడ్డుగా నిలువనున్నాయి. శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి 150 కిలోమీటర్ల పరిధిలో మరో ఎయిర్ పోర్టును నిర్మించరాదని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, జీఎంఆర్ ల మధ్య ఓ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఆర్జీఐఏకు, వరంగల్ సమీపంలోని మామ్నూరుకు మధ్య 150 కిలోమీటర్ల దూరం కూడా లేదు.

ఇదిలావుండగా, కొత్త విమానాశ్రయాలకు భూములను కూడా గుర్తించినట్టు గత సంవత్సరమే కేసీఆర్ ప్రకటించారు. బసంత్ నగర్ లో 750 ఎకరాలు, జక్రాన్ పల్లిలో 850 ఎకరాలను గుర్తించామని, ఆదిలాబాద్ సమీపంలో 350 ఎకరాలు ఉందని కేసీఆర్ వెల్లడించిన సంగతి విదితమే.
Go Back to Shorts
Telangana
Airports
KCR
AAI
Survey
Feasability

More Telugu News