Supreme Court: అయోధ్య కేసులో జూలై 31 వరకూ మధ్యవర్తిత్వాన్ని కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశం

  • న్యాయస్థానమే విచారించాలంటూ పిటిషన్
  • పూర్తి నివేదికను 18లోగా సమర్పించాలని ఆదేశం
  • నివేదికను సుప్రీంకోర్టు ముందుంచిన కమిటీ
అయోధ్య వివాదంపై నడుస్తున్న కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సమస్య పరిష్కారానికి మధ్యవర్తిత్వాన్ని మరి కొన్నాళ్ల పాటు కొనసాగించాలని సంబంధిత కమిటీకి అత్యున్నత న్యాయస్థానం సూచించింది.

అయోధ్యలోని రామ జన్మభూమి - బాబ్రీ మసీదు భూవివాదంలో సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించుకోవడానికి అవకాశముంటే సూచించాలని పేర్కొంటూ, ఈ ఏడాది మార్చి 8న సుప్రీంకోర్టు ముగ్గురు సభ్యుల కమిటీని నియమించింది. అయితే మధ్యవర్తిత్వ ప్రక్రియలో పురోగతి లేదని, దాన్ని రద్దు చేసి న్యాయస్థానమే విచారణ జరపాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలైంది.

ఈ పిటిషన్‌పై ఈ నెల 11న విచారణ జరిపిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం, మధ్యవర్తిత్వ ప్రక్రియలో ఇప్పటి వరకూ జరిగిన పురోగతిని తెలిపిన పూర్తి నివేదికను 18లోగా సమర్పించాలని ఆదేశించింది.

ఈ ఆదేశాల మేరకు కమిటీ తమ నివేదికను నేడు సుప్రీంకోర్టు ముందుంచింది. దానిని పరిశీలించిన సుప్రీంకోర్టు ఈ నెల 31 వరకూ మధ్యవర్తిత్వం కొనసాగించాలని కమిటీని ఆదేశించింది. పూర్తి నివేదికను ఆగస్ట్ 1న ఇవ్వాలని సూచించింది. తదుపరి కార్యాచరణపై ఆగస్టు 2న నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం నేడు స్పష్టం చేసింది.
Supreme Court
Ranjan Gogoi
Babri Masjid
Rama Janmabhoomi
Ayodhya

More Telugu News