Uttar Pradesh: మాయావతికి ఝలక్.. రూ.400 కోట్ల ప్లాట్ ను జప్తు చేసిన ఐటీ శాఖ!

  • మాయావతి సోదరుడి పేరుపై ఉన్న ప్లాట్
  • బినామీ చట్టం కింద జప్తు చేసిన ఐటీ అధికారులు
  • నేరం రుజువైతే ఏడేళ్లు జైలుశిక్ష పడే అవకాశం
ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, బీఎస్పీ అధినేత్రి మాయావతికి ఐటీ శాఖ అధికారులు షాక్ ఇచ్చారు. మాయావతి సోదరుడు, బీఎస్పీ నేత ఆనంద్ కుమార్, ఆయన భార్య లత పేరుపై ఉన్న రూ.400 కోట్లు విలువైన ఏడు ఎకరాల విస్తీర్ణంగల ప్లాట్ ను బినామీ చట్టం కింద జప్తు చేశారు. ఇటీవల ఆనంద్ సింగ్ ను బీఎస్పీ జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమిస్తూ మాయావతి నిర్ణయం తీసుకున్నారు. ఇది జరిగిన కొన్ని రోజులకే  ఆనంద్ సింగ్ పేరుపై యూపీలోని నొయిడాలో ఉన్న ఈ బినామీ ఆస్తిని ఐటీ శాఖలోని బినామీ ప్రొహిబిషన్ యూనిట్(బీపీయూ) జప్తు చేస్తూ ప్రొవిజినల్ ఉత్తర్వులు జారీచేసింది.

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన బినామీ వ్యవహారాల నిరోధక (సవరణ) చట్టం-2016 ప్రకారం బినామీ ఆస్తులు కలిగి ఉంటేవారికి ఏడేళ్ల జైలుశిక్ష పడుతుంది. అలాగే ఆస్తి విలువలో 25 శాతం మొత్తాన్ని జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది. కాగా, ఐటీ అధికారులు జప్తు చేసిన స్థలం ఏడు ఎకరాల వరకు ఉందనీ, ఈ ఆస్తి పుస్తక విలువే రూ.400 కోట్ల మేరకు ఉంటుందని సమాచారం. కొత్త బినామీ చట్టం అమలు విషయంలో ఐటీ శాఖ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది.
Uttar Pradesh
Mayawati
BSP
IT
RAIDS
SEIZE

More Telugu News