Avanigadda: అవనిగడ్డలో మళ్లీ బయటపడిన సర్పాలు... ఏడుగురికి పాము కాటు!

  • వర్షాల తరువాత పెరిగిన పాముల భయం
  • ఈ సంవత్సరంలో 63 మందికి పాముకాటు
  • తాజాగా ఒకరి మృతి
వానాకాలం వచ్చిందంటే చాలు... దివిసీమలో భాగమైన అవనిగడ్డ ప్రాంతం సర్ప భయంతో వణికిపోతుంది. ఎందుకంటే, ఈ ప్రాంతంలో ఒక్కసారిగా పాముల సంచారం పెరుగుతుంది. అవి ఎప్పుడు, ఎవరిని కాటేస్తాయో తెలియని పరిస్థితి. ఏ పొదలో ఏ రకమైన పాముంటుందో ఎవరూ చెప్పలేరు. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా పాము కాటుకు గురికాక తప్పదు.

నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన తరువాత, వర్షాలు కురిసి, పచ్చదనం పెరగడంతో, పాములు గుడ్లు పెట్టి, తమ సంతతిని పెంచుకున్నాయి. దీంతో అవన్నీ బయటకు వచ్చి, జనావాసాల్లోకి చేరి దొరికిన వారిని కరుస్తున్నాయి. గత సంవత్సరం అవనిగడ్డ ప్రాంతంలో 350 మంది పాము కాటుకు గురయ్యారు. గన్నవరం, మైలవరం ప్రాంతాల్లోనూ పాముల బెడద అధికంగా ఉంది. ఈ సంవత్సరంలో ఇప్పటివరకూ 63 మంది పాముకాటుకు గురికాగా, ఈ వారంలోనే 7గురిని పాములు కరిచాయి.  సరైన సమయంలో చికిత్స లభించక ఒకరు మరణించారు.

చాలావరకూ పాములు ప్రమాదకరమైనవి కావని, కొన్ని రకాల పాములు కరిస్తే మాత్రం ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ ప్రాంతంలోని అన్ని వైద్యశాలల్లో పాము కాటు విరుగుడు మందులను సిద్ధంగా ఉంచామని అన్నారు. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, రాత్రివేళల్లో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
Avanigadda
Snakes
Bite
Krishna District

More Telugu News