Andhra Pradesh: సభను హుందాగా నడుపుతాం: మంత్రి కన్నబాబు

  • 23 అంశాలపై సభలో చర్చించాలని  నిర్ణయించాం
  • ప్రతిపక్షానికి కావాల్సిన సమయం ఇస్తాం
  • గతంలో మాదిరి ప్రతిపక్ష పార్టీకి మైక్ కట్ చేయడం ఉండదు
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అర్థవంతమైన చర్చలు జరగాలని సీఎం జగన్ సూచించారని మంత్రి కన్నబాబు అన్నారు. రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బీఏసీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం ముగిసిన అనంతరం, మీడియాతో కన్నబాబు మాట్లాడుతూ, సభను హుందాగా నడుపుతామని, 23 అంశాలపై సభలో చర్చించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించామని, ప్రత్యేక హోదా, విభజన హామీలు, రాజధాని భూ కేటాయింపులు, అగ్రిగోల్డ్, కేట్యాక్స్, ఇసుక అక్రమ రవాణా అంశాలపై చర్చిస్తామని అన్నారు.

సభను అనుకున్న సమయం కంటే ఎక్కువ రోజులు నడిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న విషయాన్ని జగన్ స్పష్టం చేసినట్టు పేర్కొన్నారు. ప్రతిపక్షానికి కావాల్సిన సమయం ఇస్తామని, గతంలో చేసిన విధంగా ప్రతిపక్ష పార్టీకి మైక్ కట్ చేయడం ఉండదని స్పష్టం చేశారు. ఎన్ని రోజులు సభ జరపాలో ప్రతిపక్షాన్ని జగన్ కోరారని, దీనికి ప్రతిపక్ష పార్టీ సమాధానం చెప్పలేకపోయిందని అన్నారు. సభలో చర్చించాల్సిన అంశాలపై ప్రతిపక్షం అభిప్రాయాన్ని కోరామని, శాంతి భద్రతల అంశం ఒక్క దానిపైనే ప్రతిపక్షం చర్చ కోరిందని కన్నబాబు చెప్పారు.
Andhra Pradesh
assembly
cm
jagan

More Telugu News