Godavari: గోదావరిలో పెరుగుతున్న వరద ఉద్ధృతి...ధవళేశ్వరం వద్ద 10.9 అడుగుల నీటి మట్టం

  • నిన్న ఉదయానికి 10.7 అడుగులు
  • ఎగువ రాష్ట్రాల్లో వర్షాలు ఫలితం
  • లక్షా 18 వేల క్యూసెక్కుల నీరు దిగువకు
ఎగువన ఉన్న మహారాష్ట్ర ప్రాంతాల్లో కుండపోత వర్షాలతోపాటు పరీవాహకంలో ఉన్న కొండవాగుల నుంచి వచ్చిపడుతున్న నీటితో గోదావరి నదిలో వరద ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. భారీ స్థాయిలో నీటిమట్టం పెరుగుతుండడంతో అధికారులు అప్రమత్తంగా ఉంటున్నారు. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నిన్నటికి 10.7 అడుగుల నీటి మట్టం ఉండగా ఈరోజు ఉదయానికి 10.9 అడుగులకు చేరుకుంది.

ఎగువ నుంచి భారీగా వరద తరలి వస్తుండడంతో అధికారులు అదనపు నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. నిన్న ఉదయం 46,538 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు ఈరోజు ఉదయానికి నీటి విడుదలను లక్షా 18 వేల క్యూసెక్కులకు పెంచారు. వానాకాలం వచ్చినా గోదావరిలో జలకళ లేకపోవడంతో నిన్నమొన్నటి వరకు నిరాశతో ఎదురు చూసిన రైతుల ముఖాల్లో తాజా పరిస్థితి ఆనందాన్ని నింపుతోంది.

మరోవైపు పట్టిసీమ వద్ద గోదావరి నీటి మట్టం గణనీయంగా పెరిగింది. దీంతో పోలవరం ఎగువన ఉన్న 19 ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పోలవరం ప్రాజెక్టు ఎగువన కాఫర్‌ డ్యాం వద్ద ప్రస్తుతం నీటి మట్టం గతంలో కంటే రెండు రెట్లు ఎక్కువ ఉంది. ప్రాజెక్టు నిపుణుల కమిటీ బుధవారం పనుల పరిశీలనకు రానుంది. ప్రస్తుత వరద పరిస్థితిలో అధికారులు ఎగువ కాఫర్ డ్యాం వరకు వెళ్లడం కష్టమే.
Godavari
floods
dhavaleswaram

More Telugu News