Nadendla: బీజేపీలో చేరనున్న మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు

  • నేడు అమిత్ షా సమక్షంలో కాషాయ కండువా
  • 1978లో తొలిసారి ఎమ్మెల్యేగా విజయం
  • ఎన్టీఆర్ ను గద్దె దింపి ముఖ్యమంత్రి పదవిలోకి
మాజీ ముఖ్యమంత్రి, 1980 దశకంలో ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన నాదెండ్ల భాస్కరరావు నేడు బీజేపీలో చేరనున్నారు. కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్‌ షా సమక్షంలో ఆయన బీజేపీ పార్టీలో చేరనున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయినట్టు బీజేపీ వర్గాలు వెల్లడించాయి.

కాగా, గుంటూరు జిల్లా దోనేపూడిలో 1935 జూన్‌ 23న జన్మించిన నాదెండ్ల, 1978లో తొలిసారిగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1982లో ఎన్టీఆర్‌ టీడీపీని పెట్టినప్పుడు, ఆయనతో కలిసి నడిచిన నాదెండ్ల, ఆ మరుసటి సంవత్సరం ఎన్టీఆర్ ను పీఠం నుంచి దింపేసి, ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. 1984 ఆగస్టు 16 నుంచి సెప్టెంబరు 16 వరకు, ఆయన సీఎంగా ఉన్నారు.

ఆపై పదవి దిగిన తరువాత, 1998లో తిరిగి కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఖమ్మం ఎంపీగా విజయం సాధించారు. ఆ తరువాత దాదాపు రెండు దశాబ్దాల పాటు రాజకీయాలకు దూరంగా ఉన్న నాదెండ్ల, తాజాగా బీజేపీలో చేరాలని నిర్ణయించుకోవడం గమనార్హం. ఇదిలావుండగా, ఆయన కుమారుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో స్పీకర్‌ గా పనిచేసిన, నాదెండ్ల మనోహర్, ప్రస్తుతం జనసేనలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
Nadendla
Bhaskarrao
BJP
Telugudesam
Congress

More Telugu News