ambati rayudu: అంబటి రాయుడు రిటైర్మెంట్.. సెలెక్టర్లపై నిప్పులు చెరిగిన గౌతం గంభీర్

  • రాయుడు గొప్ప ఆటగాడు
  • భారత క్రికెట్ కు ఈరోజు ఒక దుర్దినం
  • రాయుడి రిటైర్మెంట్ కు సెలెక్టర్లే కారణం

అంతర్జాతీయ క్రికెట్ కు యువ బ్యాట్స్ మెన్ అంబటి రాయుడు రిటైర్మెంట్ ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. వరల్డ్ కప్ లో ఆడేందుకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ సెలెక్టర్లు రాయుడిని పక్కన పెట్టారు. గాయంతో జట్టుకు దూరమైన విజయ్ శంకర్ స్థానంలో కూడా రాయుడిని తీసుకోకుండా... ఒక్క వన్డే కూడా ఆడని మయాంక్ అగర్వాల్ కు స్థానం కల్పించారు. దీంతో, ఆవేదనకు గురైన రాయుడు అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు.

ఈ నేపథ్యంలో సెలెక్టర్లపై టీమిండియా మాజీ ఆటగాడు, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ మండిపడ్డారు. భారత క్రికెట్ కు ఇదొక దురదృష్టకరమైన రోజు అని అన్నారు. భారత్ తరపున రాయుడు ఎంతో అద్భుతంగా రాణించాడని మూడు సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు చేశాడని గుర్తు చేశారు. ఐపీఎల్ లో సత్తా చాటాడని చెప్పారు. అలాంటి నైపుణ్యం ఉన్న ఆటగాడు రిటైర్మెంట్ ప్రకటించడం బాధ కలిగిస్తోందని అన్నారు. సెలెక్షన్ ప్యానల్ లో ఉన్న ఐదుగురు సభ్యులందరినీ కలిపినా... రాయుడు చేసినన్ని పరుగులు చేయలేదని ఎద్దేవా చేశారు. సెలెక్టర్ల తీరు ఎంతో నిరాశను కలిగించిందని వ్యాఖ్యానించారు. రాయుడి రిటైర్మెంట్ కు సెలెక్టర్ల తప్పుడు నిర్ణయాలే కారణమని మండిపడ్డారు.

More Telugu News