Andhra Pradesh: గుంటూరులో రచ్చరచ్చ.. టీడీపీ ప్లెక్సీని చించిపడేసిన వైసీపీ కార్యకర్తలు!

  • తొలుత ప్లెక్సీని ఏర్పాటు చేసిన వైసీపీ
  • పోటీగా ప్లెక్సీని పెట్టిన ఎమ్మెల్యే అనగాని వర్గీయులు
  • ఇరువర్గాల మధ్య ఘర్షణ.. చెదరగొట్టిన పోలీసులు
ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ శ్రేణుల మధ్య మరోసారి ఘర్షణాత్మక వాతావరణం నెలకొంది. గుంటూరు జిల్లాలో తమ ప్లెక్సీ పక్కనే టీడీపీ నేతలు పోటీగా ప్లెక్సీని కట్టడంతో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు దాన్ని చించిపడేశారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య బాహాబాహీ చోటుచేసుకుంది. జిల్లాలోని రేపల్లెలో ఇటీవల వైసీపీ నేతల పర్యటన సందర్భంగా రాజ్యలక్ష్మి సెంటర్ లో వైసీపీ కార్యకర్తలు ప్లెక్సీలు ఏర్పాటు చేశారు.

అయితే టీడీపీ కార్యకర్తలు దీనికి పక్కనే స్థానిక ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ పేరుతో మరో ప్లెక్సీని ఏర్పాటు చేశారు. దీంతో సహనం కోల్పోయిన వైసీపీ కార్యకర్తలు భారీగా అక్కడకు చేరుకున్నారు. అనంతరం ఒక్కసారిగా టీడీపీ ప్లెక్సీని చించి కిందపడేశారు. విషయం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు భారీగా అక్కడకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇరువర్గాలను అక్కడి నుంచి చెదరగొట్టారు.
Andhra Pradesh
Guntur District
Telugudesam
YSRCP
fight
Police

More Telugu News