Andhra Pradesh: రాష్ట్రాన్ని చెదపురుగుల్లా తినేసి ఇప్పుడు సుమతీ శతకాలు వల్లిస్తే నమ్మేస్తారా?: విజయసాయిరెడ్డి

  • టీడీపీ నేతలు నిజాయతీగా పని చేశామంటారు
  • విచారణకు ఆదేశిస్తే కక్ష సాధింపు చర్యలంటారు!
  • జన్మభూమి కమిటీలు ప్రజలను పీడించుకు తిన్నాయి
టీడీపీపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోమారు విమర్శలు చేశారు. ఒక వైపు నిజాయతీగా పని చేశామని టీడీపీ నేతలు బాజా కొట్టుకుంటారని, ఇంకో పక్క వారిపై విచారణకు ఆదేశిస్తే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటారని విమర్శించారు. ఏ తప్పూ చేయని వారికి ఆందోళన ఎందుకు చంద్రబాబు గారూ? రాష్ట్రాన్ని చెదపురుగుల్లా తినేసి ఇప్పుడు సుమతీ శతకాలు వల్లిస్తే నమ్మేస్తారా? అని ఓ ట్వీట్ లో ప్రశ్నించారు.

నిరుద్యోగ యువతను గ్రామ వలంటీర్లుగా నియమిస్తుంటే జన్మభూమి కమిటీలు గుర్తుకొస్తున్నాయా చంద్రబాబు గారూ? అని మరో ట్వీట్ లో విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ప్రజలను పీడించుకు తిన్న జన్మభూమి కమిటీలకు, గ్రామ వాలంటీర్ల వ్యవస్థకు తేడా ఏమిటో తొందర్లోనే తెలుస్తుందని, అప్పటి దాకా కాస్త ఓపిక పట్టాలని సూచించారు.

నిన్న తన జన్మదినం సందర్భంగా శుభాభినందనలు తెలిపిన ప్రతి ఒక్కరికి తన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని మరో ట్వీట్ లో విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. శ్రేయోభిలాషుల అభిమానం,  అండదండలు పొందడం తన భాగ్యంగా భావిస్తున్నానని, వారి సహకారం, ప్రోత్సాహం సదా తనకు ఉండాలని ఆకాంక్షించారు.
Andhra Pradesh
YSRCP
mp
vijayasai reddy

More Telugu News