Nara Lokesh: అనంతపురం మహిళ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది... జగన్ ఏం చెబుతారు?: లోకేశ్ ఫైర్

  • ప్రజాదర్బార్ వాయిదా వేసిన విషయం ప్రజలకు తెలియదు
  • అర్జీలు ఇచ్చేందుకు జగన్ నివాసానికి తరలివచ్చారు
  • కక్ష మీది, శిక్ష ప్రజలకా?
టీడీపీ నేత, ఏపీ మాజీ మంత్రి నారా లోకేశ్ వైసీపీ సర్కారుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత ప్రభుత్వ హయాంలో సీఎంకు ఎవరైనా అర్జీలు ఇవ్వాలంటే వారికి ప్రజావేదిక ఉండేదని, కానీ ఇప్పటి ప్రభుత్వం ప్రజావేదికను కూల్చివేసిందని, జూలై 1న ప్రజాదర్బార్ అంటూ ఆర్భాటంగా ప్రకటించి చివరికి వాయిదా వేశారని ఆరోపించారు. ప్రజాదర్బార్ వాయిదా విషయం తెలియని ప్రజలు ఎక్కడికెళ్లాలో తెలియక సీఎం జగన్ ఇంటికెళ్లారని తెలిపారు. అక్కడ అర్జీలు ఇచ్చేందుకు జరిగిన తోపులాటలో అనంతపురానికి చెందిన ఓ మహిళ అస్వస్థతకు గురైందని, ఇప్పుడామె పరిస్థితి ఆందోళనకరంగా ఉందని లోకేశ్ వెల్లడించారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీశారు.

ప్రజల గురించి ఏర్పడిన ప్రభుత్వం పగ, ప్రతీకారాల గురించి ఆలోచిస్తుంటే పరిస్థితి ఇలాగే ఉంటుందని విమర్శించారు. మీ కక్షలకు ప్రజలను ఎందుకు శిక్షిస్తారంటూ ప్రశ్నించారు. సమస్యలను ప్రభుత్వానికి విన్నవించుకునేందుకు వచ్చేవారి కోసం ప్రజావేదిక వంటి సౌకర్యాన్ని ఏర్పాటు చేయాల్సింది ప్రభుత్వమేనని, ఉన్న ప్రజావేదికను ఓ ఘనకార్యం అన్నట్టుగా కూల్చివేశారని లోకేశ్ మండిపడ్డారు. ఇప్పుడు ప్రజాదర్బార్ ను వాయిదా వేయడం ద్వారా యూటర్న్ తీసుకున్నారంటూ ధ్వజమెత్తారు.
Nara Lokesh
Jagan
YSRCP
Andhra Pradesh

More Telugu News