Tsubaki Tomomi: అందం కోసం 300 సార్లు ఆపరేషన్ టేబులెక్కిన అతివ!

  • వికారంగా ఉన్నావంటూ తల్లి వ్యాఖ్యలు
  • తల్లి మాటలను అవమానంగా ఫీలైన జపాన్ యువతి
  • 18వ ఏట నుంచే ప్లాస్టిక్ సర్జరీలు
అందంగా ఉండాలని కోరుకోని అమ్మాయిలు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఈ జపాన్ మోడల్, యాంకర్ భామ కూడా అందుకు మినహాయింపు కాదు. అయితే, అందంపై అతి మోజుతో 300 సార్లు ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్నా, ఇంకా ఆమెకు తృప్తి కలగడంలేదు. ఆమె పేరు సుబాకి తమోమి. వయసు 39 ఏళ్లు. తన జీవితంలో 18వ ఏట నుంచే ప్లాస్టిక్ సర్జరీల బాట పట్టింది. అందుకు కారణం సుబాకి తల్లే.

ఆమె ఎప్పుడూ సుబాకిని అందంగా లేవు అంటూ విమర్శిస్తుండేది. అంతేకాకుండా, పరాయివాళ్ల ముందు కూడా కూతుర్ని అందవిహీనంగా ఉన్నావంటూ అవమానించేలా మాట్లాడేది. దాంతో, ఎలాగైనా అందంగా మారిపోవాలన్న తపన సుబాకిలో ఏర్పడింది. ప్లాస్టిక్ సర్జరీలే అందుకు మార్గం అని గ్రహించి టీనేజ్ లో ఉండగానే శస్త్రచికిత్సలతో అందాన్ని ఇనుమడింపజేసుకునే ప్రయత్నాలు చేసింది.

ప్రస్తుతం 40వ పడికి దగ్గర్లో ఉన్న సుబాకి చూడగానే ముచ్చటైన బొమ్మలా కనిపిస్తుంది. సుబాకి ఇప్పటికీ నిత్యయవ్వనం కోసం ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటూనే ఉంది. అందం మరింత పెరుగుతుందంటే ఇకముందు కూడా ప్లాస్టిక్ సర్జరీలు కొనసాగిస్తానని చెబుతోంది.
Tsubaki Tomomi
Japan

More Telugu News