Nusrat Jahan: నటి, తృణమూల్ ఎంపీ నుస్రత్ జహాన్‌పై ఫత్వా జారీ

  • జైన్ యువకుడిని పెళ్లాడిన ఎంపీ
  • నుదుట సింధూరం, తాళిబొట్టుతో పార్లమెంటుకు హాజరు
  • నుస్రత్‌కు అండగా నిలిచిన సాధ్వి ప్రాచి
జైన్ యువకుడిని పెళ్లాడిన ప్రముఖ నటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ రూహిపై దేవ్‌బంద్ మతపెద్దలు ఫత్వా జారీ చేశారు. పశ్చిమ బెంగాల్‌లోని బసీర్హాట్ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న నుస్రత్ ఈ నెల 19న వ్యాపారవేత్త నిఖిల్ జైన్‌ను టర్కీలో వివాహం చేసుకున్నారు. నుదుట సింధూరం, మంగళసూత్రంతో ఆమె పార్లమెంటుకు హాజరయ్యారు. దీనిని తీవ్రంగా పరిగణించిన దేవ్‌బంద్ ఫత్వా జారీ చేసింది.

ఈ సందర్బంగా మతపెద్ద ముఫ్తీ అసద్ వజిమి మాట్లాడుతూ.. ఇస్లాం ప్రకారం ఓ ముస్లిం మరో ముస్లింను మాత్రమే పెళ్లాడాల్సి ఉంటుందన్నారు. నటులు మతం గురించి పట్టించుకోరని, ఏం చేయాలనుకుంటే అదే చేస్తారని నుస్రత్ విషయంలోనూ నిజమైందని పేర్కొన్నారు. ఆమె గురించి మాట్లాడడం దండగన్న ఆయన ఆమె జీవితంలో ఇకపై జోక్యం చేసుకోబోమన్నారు.

నుస్రత్ జహాన్‌కు ఫత్వాపై బీజేపీ నేత సాధ్వి ప్రాచి స్పందించారు. జహాన్‌కు అండగా నిలిచారు. లవ్ జిహాద్ పేరుతో హిందూ యువతులను పెళ్లాడి వారితో బలవంతంగా బురఖాలు ధరింపజేస్తున్నారని, మరి వాటి సంగతేంటని ప్రశ్నించారు. అది న్యాయమైనప్పుడు నుస్రుత్ సింధూరం పెట్టుకుని, తాళిబొట్టు ధరించడం కూడా న్యాయమేనని పేర్కొన్నారు.
Nusrat Jahan
Trinamool Congress
sindoor
inclusive India

More Telugu News