Lok satta: ‘అమ్మఒడి’ మంచిదే కానీ, విద్యా ప్రమాణాలు అధ్వానంగా ఉన్నాయి: జయప్రకాశ్ నారాయణ్

  • ప్రజా జీవితాలతో సంబంధం లేని రాజకీయం నడుస్తోంది
  • ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు అధ్వానంగా ఉన్నాయి
  • విద్యా ప్రమాణాలు మెరుగుపడకుండా ఎన్ని డబ్బులిచ్చినా ఉపయోగం లేదు?
దేశంలోని ప్రజల జీవితాలతో సంబంధం లేని రాజకీయం ప్రస్తుతం నడుస్తోందని లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ (జేపీ) అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, అలా ఉన్నంత కాలం ఈ దేశంలో ఎవరు ప్రధాని అయినా, ముఖ్యమంత్రి అయినా ప్రజలకు ఒరిగేదేమీ లేదని అన్నారు. ‘ప్రభుత్వ ఉద్యోగులను సంతృప్తి పరిచి మీ ఇష్టమొచ్చినట్టు చేసుకోండి. మాకు మాత్రం ఓటు వేయండి’ అనే ధోరణే తప్ప, ప్రభుత్వ ఉద్యోగులతో పని చేయించే సంస్కారం మన పరిపాలనలో ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు. జేబులో డబ్బులు ఖర్చు కాకుండా ప్రజలకు మంచి ప్రమాణాలతో విద్య, ఆరోగ్యం అందించే ఏర్పాట్లు ఏమైనా ఉన్నాయా? అని ప్రశ్నించారు.

‘అమ్మఒడి’ కావచ్చు, ఇంకేదైనా పథకం కావచ్చు వాటి ద్వారా పేదలకు ఎన్ని డబ్బులిచ్చినా సంతోషమే కానీ, ప్రభుత్వం, ప్రైవేట్ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు ఏ మేరకు మెరుగుపడతాయన్నది ముఖ్యమని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో అధ్వానపు చదువు అందుతోందని తాను సాక్ష్యాధారాలతో చెబుతున్నానని అన్నారు. విద్యాప్రమాణాలు మెరుగుపడకుండా ఎన్ని డబ్బులిచ్చినా ఉపయోగం లేదని, ఫీజ్ రీయింబర్స్ మెంట్ పథకమైనా, ఇప్పుడు ఈ పథకమైనా అంతే అవుతుందని అభిప్రాయపడ్డారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రజలకు మెరుగైన విద్య, ఆరోగ్యంపై దృష్టి సారించడం లేదని, అలాంటప్పుడు, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఉపయోగం లేదని అన్నారు.
Lok satta
Jayaprakash Narayan
YSRCP
Amma odi

More Telugu News