Andhra Pradesh: వైసీపీ ప్రభుత్వంపై ఏడాదిపాటు విమర్శలు చేయం: పవన్ కల్యాణ్

  • సత్ఫలితాలు ఇచ్చే పథకాలు ప్రవేశపెడితే హర్షిస్తాం
  • ప్రజలకు ఇబ్బంది కలిగితే పోరాడతాం
  • తెలంగాణకు ఏపీ భవనాలు అప్పగించడంపై వైసీపీ వివరణ ఇవ్వాలి
ఏపీలో కొత్తగా ఏర్పడ్డ వైసీపీ ప్రభుత్వంపై ఏడాదిపాటు విమర్శలు చేయమని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. విజయవాడలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ప్రభుత్వ పనితీరుపై ఏడాది పాటు వేచి చూశామని, ఇప్పుడు కూడా వైసీపీ ప్రభుత్వ పనితీరుపై కొంత సమయం తీసుకుని మాట్లాడతామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిజంగా ప్రజలకు సత్ఫలితాలు ఇచ్చే పథకాలు ప్రవేశపెడితే కచ్చితంగా హర్షిస్తామని, అలాగే, ప్రజలకు ఇబ్బంది కలిగించే పరిస్థితులు తలెత్తితే వాటి పరిష్కారానికి పోరాడతామని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి ఏపీ సచివాలయ భవనాలు అప్పగించడంపై ఆయన స్పందించారు. ఈ విషయమై వైసీపీ ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వివరణ ఇవ్వడం ద్వారా ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం ఏర్పడుతుందని అన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య సున్నితమైన అంశాలు ఉన్నాయని, వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని క్షేత్ర స్థాయిలో అందరితో మాట్లాడి తమ కార్యాచరణ ప్రణాళికను ముందుకు తీసుకెళ్తామని చెప్పారు.
Andhra Pradesh
Telangana
YSRCP
jagan
cm
janasena
Pawan Kalyan
Vijayawada
meeting

More Telugu News