snake: దాహంతో అలమటించిన పాము... తలనిమురుతూ నోట్లో నీరు పోసిన అటవీ శాఖాధికారి!

  • దాహార్తితో పడగవిప్పి ఎదురు చూస్తున్న నాగరాజు
  • గమనించి సమీపంలోకి వెళ్లిన అధికారి
  • బాటిల్‌తో నీరందించడంతో గుటకవేస్తూ సేదదీరిన సర్పం
పామును చూస్తేనే వణికిపోతాం. ఇక తాచుపాము అయితే హడలిపోతాం. వీలైతే తరిమి కొడతాం. అవకాశం వస్తే చంపేస్తాం. కానీ మండే ఎండలో దాహార్తితో నీటి కోసం ఎదురు చూస్తున్న ఓ సర్పరాజుకు అటవీ శాఖ అధికారి ఒకరు నీరందించి మానవత్వాన్ని చాటుకున్నాడు. సదరు అధికారి పాము తల నిమురుతూ బాటిల్‌తో అందిస్తున్న నీటిని అది గుటకలు వేస్తూ తాగుతున్న వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో  జోరుగా చక్కర్లు కొడుతోంది.

వివరాల్లోకి వెళితే...ఇటీవల వేసవి ఎండలు మండించిన విషయం తెలిసిందే. అటువంటి మండుటెండలో ఓ అరటి తోటలో పడగవిప్పి నీటి కోసం ఎదురుచూస్తోంది ఒక తాచుపాము. అటుగా వెళ్లిన అటవీ శాఖ అధికారి ఒకరు పామును గమనించి, అది దాహార్తితో నీటి కోసం ఎదురు చూస్తోందని అర్థం చేసుకున్నారు. వెంటనే తనవద్ద ఉన్న బాటిల్‌లో నీటిని దానికి పట్టించారు. అంతేకాదు చిన్నపిల్లాడిని సాకినట్టు పాము పడగపై చేయివేసి నిమురుతూ బాటిల్‌ను దాని నోటివద్ద పెడితే అది గుటకలు వేస్తూ నీటిని తాగేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట జోరుగా తిరుగుతున్నా ఎప్పుడు, ఎక్కడ జరిగిందన్న వివరాలు మాత్రం లేవు.
snake
forest officer
water

More Telugu News