Jagan: కొండను తవ్వే జగన్ కు ఎలుక కాదుగదా... చీమ కూడా దొరకదు: టీడీపీ నేత అచ్చెన్నాయుడు
- విదేశాల నుంచి నేతలతో సమావేశం
- టీడీపీకి మరకలంటించేందుకు ప్రయత్నాలు
- జగన్ శ్రమ వృథాయే
ఇసుమంతైనా అవినీతి జరగని చోట, కేవలం తెలుగుదేశం పార్టీకి మరకలు పూయాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఇందుకోసం కొండను తవ్వాలని భావిస్తున్న జగన్ కు ఎలుక కాదుగనా, చీమ, దోమ కూడా దొరకవని, ఆయన ప్రయత్నం వృథా అవుతుందని మాజీ మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తన కుటుంబంతో విదేశాల్లో సేద దీరుతున్న చంద్రబాబు, తన నివాసానికి వచ్చిన పార్టీ నేతలతో ఫోన్ లో మాట్లాడిన వేళ, పలువురు నేతలు ఆయనతో తాజా రాజకీయాలపై చర్చించారు.
అవాస్తవ ఆరోపణలు చేస్తూ, టీడీపీకి అవినీతిని అంటించాలని చూస్తున్నారని, అది వారికే తగులుతుందని అచ్చెన్నాయుడు అన్నారు. దీనిపై స్పందించిన చంద్రబాబు, టీడీపీ అన్ని వేళలా ప్రజల పక్షమేనని, విపక్షంలో ఉన్నా రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేస్తుందని అన్నారు. ప్రజలకు చేరువయ్యేందుకు పార్టీ నేతలు, కార్యకర్తలు శ్రమించాలని సూచించారు. ముఖ్యమంత్రి జగన్ కావాలనే ఆరోపణలు చేస్తున్నారని, వాస్తవాలు లేని ఆ ఆరోపణలను తిప్పికొట్టాలని ఆదేశించారు.