Vijay Sai Reddy: మీ దోపిడీలన్నీ బయటకొస్తాయి. ఎవరూ తప్పించుకోలేరు ఉమా: విజయసాయిరెడ్డి హెచ్చరిక

  • పోలవరం అంచనాలు ఎలా తగ్గిస్తారని ప్రశ్నించిన దేవినేని ఉమ
  • తప్పుబట్టిన వైసీపీ ఎంపీ విజయసాయి
  • ట్విట్టర్ లో మండిపాటు
పోలవరం పనుల అంచనాలను ఎలా తగ్గిస్తారో చెప్పాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వ్యాఖ్యానించడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు తప్పుబట్టారు. ఉమ వ్యాఖ్యలు వింటుంటే, దొంగే తనను పట్టుకోవాలని పోలీసులకు సవాల్ విసిరినట్టుందని తన ట్విట్టర్ వేదికగా ఎద్దేవా చేశారు. "పోలవరం పనుల అంచనాలను ఎలా తగ్గిస్తారో చెప్పాలని మాజీ మంత్రి ఉమా అనడం, దమ్ముంటే తనను పట్టుకోమని దొంగ పోలీసులకు సవాలు విసిరినట్టుగా ఉంది. అన్ని అనుమతులుండి, పనులు మొదలైన ప్రాజెక్టును ఐదేళ్ళు ఏటీఎంలాగా వాడుకున్నారు. మీ దోపిడీలన్నీ బయటకొస్తాయి. ఎవరూ తప్పించుకోలేరు ఉమా" అని అన్నారు.

అంతకుముందు మరో ట్వీట్ లో "సీఎం జగన్ గారి ఆదేశాల మేరకు ఓబీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని రాజ్యసభలో ప్రైవేటు బిల్లు ప్రవేశ పెట్టాం. దేశంలోని ఓబీసిలంతా సామాజికంగా ఉన్నత స్థాయికి ఎదగాలని జగన్‌ గారి ఆకాంక్ష. దీనిపై జరిగే చర్చ తప్పని సరిగా వారి అభ్యున్నతికి దారులు వేస్తుంది" అని ఆయన అన్నారు. "ప్రజావేదిక ప్రభుత్వ నిధులతో నిర్మించిన సదుపాయం. చంద్రబాబు దానిని పార్టీ కార్యక్రమాలకు వాడుతున్నారు. ఓడిపోయినా తన ఆక్రమణలోనే పెట్టుకున్నారు. కలెక్టర్ల కాన్ఫరెన్సుకు సిద్ధం చేస్తుంటే బాబు లేనపుడు తాళాలు తీస్తారా అంటూ ఆ పార్టీ నాయకులు సానుభూతి డ్రామాలాడటం పరువు తీసుకోవడమే" అని కూడా విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.
Vijay Sai Reddy
Polavaram
Devineni Uma

More Telugu News