Dubai: కన్నతల్లి కళ్లు పీకి, ఎముకలు విరిచి... దుబాయ్ లో భార్యతో కలసి కొడుకు దాష్టీకం!

  • దుబాయ్ లో కన్నతల్లి మరణానికి కారణమైన కుమారుడు
  • దారుణంగా హింసించి చంపారని పోలీసుల అభియోగాలు
  • పక్కింటి ఉద్యోగిని ఫిర్యాదుతో దారుణం వెలుగులోకి
కన్నతల్లిపై అత్యంత దారుణంగా కుమారుడు ప్రవర్తిస్తుంటే, అతనికి సహకరించిన భార్య ఇప్పుడు తీవ్రమైన శిక్షను అనుభవించనుంది. కఠినమైన చట్టాలు అమలయ్యే దుబాయ్ లో ఈ ఘటన జరిగింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, దుబాయ్ లో ఉంటున్న ఓ భారత సంతతి జంట, తమ ఇంట్లోని వృద్ధ మహిళను దారుణంగా హింసించి, ఆమె మరణానికి కారణమైందన్న అభియోగాలు నమోదయ్యాయి.

వీరిద్దరూ కలిసి ఆమెపై భౌతిక దాడులు చేసిన కారణంగానే ఆమె మరణించిందని పోలీసులు తమ విచారణలో తేల్చారు. ఆమె కళ్లను వీరు పెకిలించారని, ఎముకలు విరిచేశారని, ఇది జూలై 2018 నుంచి అక్టోబర్ 2018 మధ్య జరుగగా, మరణించే సమయానికి ఆమె కేవలం 29 కిలోల బరువు మాత్రమే ఉందని పోస్ట్ మార్టం నిర్వహించిన ఫోరెన్సిక్ నిపుణులు నివేదిక ఇవ్వడంతో, దీన్ని పరిశీలించిన న్యాయస్థానం తీవ్రమైన నేరంగా అభిప్రాయపడింది.

తమ పక్కింట్లో ఓ వృద్ధ మహిళను దారుణంగా హింసించి, ఆమె మరణానికి కారకులయ్యారని పొరుగున్న ఉన్న ఓ ఉద్యోగిని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మొత్తం వ్యవహారం బయటకు వచ్చింది. గత సంవత్సరం అక్టోబర్ 31న వృద్ధురాలు మరణించగా, కేసు నమోదు చేసిన అల్ ఖుసాయిస్ పోలీసులు, నిందితులను న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టారు. ఈ కేసులో త్వరలో తీర్పు వెలువడనుండగా, ఈ జంటకు కఠిన శిక్ష తప్పదని న్యాయ నిపుణులు అంటున్నారు.
Dubai
Mother
Court

More Telugu News