Jagan: అగ్నిసాక్షిగా చెబుతున్నా... నా హృదయంలో ఆత్మగా ప్రేమిస్తున్న వ్యక్తి జగన్: స్వరూపానందేంద్ర

షార్ట్స్‌లో చూడండి
విజయవాడలో ఇవాళ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికార శిష్య తురియాశ్రమ దీక్షా మహోత్సవం నిర్వహించారు. శారదాపీఠం ఉత్తరాధికారిగా స్వామి స్వరూపానందేంద్ర ప్రియశిష్యుడు కిరణ్ కుమార్ శర్మకు బాధ్యతలు అప్పగించే ఈ కార్యక్రమానికి తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్ సహా అనేక రంగాలకు చెందిన ప్రముఖులు, భక్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామి స్వరూపానందేంద్ర తన అభిప్రాయాలు వెల్లడించారు.

అగ్నిసాక్షిగా చెబుతున్నాను, నా హృదయంలో ఆత్మగా ప్రేమిస్తున్న వ్యక్తి జగన్ అంటూ ఏపీ సీఎంపై తన ఆప్యాయతానురాగాలను చాటుకున్నారు. అంతేగాకుండా, తనకు అత్యంత ఇష్టమైన వ్యక్తి కేసీఆర్ అని ఉద్ఘాటించారు. కేసీఆర్ మంచి మనసున్న వ్యక్తి అని, అంతకుమించిన మేధావి అని కొనియాడారు. 'మహాభారతాన్ని రెండుసార్లు చదివిన వ్యక్తి మా కేసీఆర్' అంటూ వ్యాఖ్యానించారు. జగన్, కేసీఆర్ ఇద్దరూ తనకు ప్రాణసమానులని పేర్కొన్న శారదా పీఠాధిపతి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరూ వచ్చి ఉత్తరాధికారి దీక్షా స్వీకరణ కార్యక్రమాన్ని ఆస్వాదించడం శుభపరిణామం అని పేర్కొన్నారు.

ఇక, నూతన ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతిని తన తొడపై కూర్చోబెట్టుకుని పెంచానని చెబుతూ వాత్సల్యాన్ని ప్రదర్శించారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో నిర్దిష్టంగా చెప్పగలిగిన పీఠం తమ శారదా పీఠం అని తెలిపారు. తెలుగునాట అధర్మం ఓడి ధర్మం గెలిచింది అని చెప్పడానికి ఈ ఇద్దరు రాజులే నిదర్శనం అని జగన్, కేసీఆర్ లను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. వీరిద్దరూ 15 ఏళ్లు దిగ్విజయంగా తమ రాష్ట్రాలను పరిపాలించాలని స్వరూపానందేంద్ర సరస్వతి ఆకాంక్షించారు.
Go Back to Shorts
Jagan
KCR
Andhra Pradesh
Telangana
Swarupanandendra

More Telugu News