Andhra Pradesh: మాట తప్పిన చంద్రబాబుది దౌర్భాగ్యమైన పరిపాలన: వైసీపీ ఎమ్మెల్యే రోజా

  • నాడు బెల్టు షాపుల రద్దుపై మొదటి సంతకం బాబు చేయలేదు
  • డ్వాక్రా మహిళలను నిలువునా ముంచారు
  • చంద్రబాబు పొర్లు దండాలు పెట్టాలి
గత ప్రభుత్వ హయాంలో మహిళలకు భద్రత కరవైందని వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ, ఎనభై లక్షల మంది డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు వారిని నిలువునా ముంచారని దుయ్యబట్టారు. డ్వాక్రా మహిళలను మోసం చేసిన చంద్రబాబు పొర్లుదండాలు పెట్టాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దర్శకుడు బోయపాటి శ్రీనుతో యాడ్స్ చేయించి డ్వాక్రా రుణమాఫీ చేశామని అబద్ధపు ప్రకటనలు చేశారని ఆరోపించారు.

బెల్టు షాపుల రద్దుపై తన మొదటి సంతకాన్ని చేస్తానని మాట తప్పిన చంద్రబాబుది దౌర్భాగ్యమైన పరిపాలన అని విరుచుకుపడ్డారు. చంద్రబాబు పాలనలో వీధివీధికీ ఓ బెల్టు షాపు పెట్టి ప్రజలను ఇబ్బందిపాలు చేశారని అన్నారు. అటువంటి పిచ్చి తుగ్లక్ పాలన అంతమైపోయిందంటూ చంద్రబాబుపై ఓ రేంజ్ లో ధ్వజమెత్తారు. సీఎం జగన్ మహిళల కోసం విప్లవాత్మకమైన పథకాలకు శ్రీకారం చుట్టారని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు సీఎం జగన్ భరోసా కల్పించారని అన్నారు. ఐదేళ్లలో గుడిసెలు లేని ఆంధ్రప్రదేశ్ ను మనం చూడబోతున్నామని, ఆశావర్కర్లు, అంగన్ వాడీలకు మేలు చేసిన ఘనత జగన్ దేనని, దశల వారీగా మద్య నిషేధం మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతుందని చెప్పారు.
Andhra Pradesh
Ap Assembly
YSRCP

More Telugu News