Andhra Pradesh: మూడు వారాల్లోనే మా కార్యకర్తలపై వందకు పైగా దాడులు జరిగాయి: చంద్రబాబునాయుడు

  • విజయవాడలో టీడీపీ రాష్ట్ర స్థాయి సమావేశం
  • దాడులు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే
  • మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున ఆర్థిక సాయం
టీడీపీ కార్యకర్తలపై వైసీపీ చేస్తున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. విజయవాడలో టీడీపీ రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయంపై, భవిష్యత్ ప్రణాళికపై చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, తమ కార్యకర్తలపై దాడులు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సూచించారు. ఎన్నికల ఫలితాలు వెలువడ్డ మూడు వారాల్లోనే తమ కార్యకర్తలపై వందకుపైగా దాడులు జరిగాయని అన్నారు. టీడీపీ కార్యకర్తల ఆస్తులు, శిలాఫలకాలపై దాడులు జరిగాయని, ఎన్టీఆర్ విగ్రహానికి నిప్పుపెట్టడం, తమ కార్యాలయానికి నిప్పుపెట్టడం వంటి దారుణాలకు వైసీపీ మూకలు పాల్పడ్డాయని అన్నారు.

గ్రామస్థాయిలోని టీడీపీ కార్యకర్తలకు నేతలు అండగా ఉండాలని చంద్రబాబు పిలుపు నిచ్చారు. తెలుగుదేశం పార్టీ ఐదు సార్లు గెలిచినా ఈ రకంగా ఎప్పుడూ దాడులు చేయలేదని, దాడులను నివారించడం, దౌర్జన్యాలను ఎదుర్కోవడమే తక్షణ కర్తవ్యమని, నమ్ముకున్న వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు. వైసీపీ దాడుల్లో హత్యకు గురైన కార్యకర్తల కుటుంబాలకు టీడీపీ బాసటగా నిలుస్తుందని భరోసా కల్పించారు. వైసీపీ మూకలు చేసిన దాడుల్లో మృతి చెందిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు ఆర్థిక సాయం చేస్తామని చెప్పిన చంద్రబాబు, ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షలు చొప్పున ప్రకటించారు.  
Andhra Pradesh
Telugudesam
Chandrababu
Vijayawada

More Telugu News