Sachin Tendulkar: స్పార్టన్ సంస్థపై కోర్టుకెక్కిన సచిన్ టెండూల్కర్

  • సచిన్ తో 2016లో స్పార్టన్ ఒప్పందం
  • 2 మిలియన్ డాలర్లు చెల్లించేందుకు అంగీకారం
  • ఇంతవరకు చెల్లించని వైనం
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ క్రికెట్ ఉపకరణాల తయారీ సంస్థ స్పార్టన్ స్పోర్ట్స్ ఇంటర్నేషనల్ పై సిడ్నీ కోర్టులో దావా వేశాడు. స్పార్టన్ సంస్థ తన పేరును, ముఖచిత్రాన్ని వాడుకుని తనకు చెల్లించాల్సిన రాయల్టీని చెల్లించలేదంటూ సచిన్ తన దావాలో పేర్కొన్నాడు. తనతో స్పార్టన్ 2016లో ఒప్పందం కుదుర్చుకుందని, కానీ తనకు చెల్లించాల్సిన 20 లక్షల డాలర్లను ఇంతవరకు చెల్లించకపోగా, తాను పంపిన సందేశాలకు సైతం బదులు ఇవ్వలేదని సచిన్ వివరించాడు.

అందుకే ఇకమీదట తన పేరు, ముఖచిత్రం వాడుకోవద్దని స్పార్టన్ కు స్పష్టం చేశానని, అయినప్పటికీ స్పార్టన్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వస్తోందని ఈ మాస్టర్ బ్లాస్టర్ పేర్కొన్నాడు. కాగా, స్పార్టన్ సంస్థ ప్రచారం కోసం లండన్, ముంబయి వంటి మహానగరాల్లో పలు కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నానని వెల్లడించాడు. దీనిపై విచారణ జరిపి తనకు రావాల్సిన పారితోషికాన్ని చెల్లించేలా చూడాలని సచిన్ తన దావాలో కోరాడు.
Sachin Tendulkar
Spartan
Australia

More Telugu News