Chandrababu: లోకేశ్ ఆఫీసే ఇప్పుడు టీడీపీ శాసనసభ పక్ష కార్యాలయం!

  • ఉదయం 11 గంటలకు సమావేశాలు ప్రారంభం
  • చంద్రబాబుకు మండలి బుద్ధ ప్రసాద్ చాంబర్
  • వైసీపీ, టీడీపీ శాసనసభాపక్ష కార్యాలయాలను తీసుకున్న వైసీపీ
వైసీపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఐదు రోజులపాటు జరగనున్న ఈ సమావేశాల కోసం ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 11 గంటలకు సమావేశాలు ప్రారంభం కానుండగా, తొలుత సీఎం జగన్, ఆ తర్వాత ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు, అనంతరం శాసన సభ్యులతో ప్రొటెం స్పీకర్ శంబంగి చినవెంకట అప్పలనాయుడు ప్రమాణ స్వీకారం చేయిస్తారు.

అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ప్రభుత్వం మంత్రులు, ప్రతిపక్ష నేత చంద్రబాబుకు కార్యాలయాలు కేటాయించింది. గతంలో డిప్యూటీ స్పీకర్‌ మండలి బుద్ధప్రసాద్‌కు ఇచ్చిన చాంబర్‌ను చంద్రబాబుకి కేటాయించగా, లోకేశ్ కార్యాలయాన్ని టీడీపీ శాసనసభాపక్ష కార్యాలయానికి కేటాయించారు. గత సభలో వైసీపీ శాసనసభాపక్ష కార్యాలయం, తెలుగుదేశం శాసనసభ పక్ష కార్యాలయం, ప్రతిపక్ష నేత హోదాలో జగన్‌కు కేటాయించిన చాంబర్లను వైసీపీ తీసుకుంది.  

ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ శాసనసభ సమావేశాలను ప్రజాస్వామ్యయుతంగా నిర్వహిస్తామన్నారు. ప్రతిపక్షాన్ని గౌరవిస్తామన్నారు. 14 తర్వాత సమావేశాలు కొనసాగించాలా? వద్దా? అనే అంశంపై సభా వ్యవహారాల సలహా కమిటీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రతి ఒక్కరికీ మాట్లాడే అవకాశం కల్పిస్తామని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సభను నిర్వహిస్తామని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు.
Chandrababu
Jagan
Assembly
Telugudesam
YSRCP

More Telugu News